
ఐపీఎల్ 2022 సీజన్‌కు దీపక్ చహర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా చహర్ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీపక్ చహర్ ఉదంతంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) ఫిజియోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక గాయంతో బాధపడుతూ రీహాబిటేషన్‌లో ఉన్న ఆటగాడు కోలుకుంటున్న సమయంలోనే మరో గాయం బారిన పడడమేంటని.. అసలు ఫిజియోలు ఏం చేస్తున్నారని మండిపడింది.
''వినడానికి ఆశ్చర్యంగా ఉంది. గాయపడి రీహాబిటేషన్‌లో కోలుకుంటున్న ఆటగాడు మరో గాయం బారిన పడ్డాడు. అంటే ఎన్‌సీఏ ఫిజియోలు సరిగా పని చేయడం లేదు. ఒక విషయం క్లియర్‌గా మీకు తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఒక్క దీపక్ చహర్ మాత్రమే కాదు.. ఇంతకముందు కూడా గాయపడిన ఆటగాళ్లు రీహాబిటేషన్‌లో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో జరగబోయే మేజర్ ఈవెంట్స్‌లో ఆటగాళ్ల ఎంపికలో చాలా సమస్యలు వస్తాయి.
ఈ అంశంపై ఎన్‌సీఏ డైరెక్టర్లు నితిన్, వివిఎస్ లక్ష్మణ్‌తో చర్చలు నిర్వహిస్తాం. అసలెందుకు ఆటగాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకోవడం లేదనే దానిపై ఆరా తీస్తాం.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. నిజం చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితిపై ఎవరం సంతోషంగా లేము. గాయాలనేవి ఆటగాళ్లకు సహజం. వాళ్లు కోలుకోవాలనే ఎన్‌సీఏ పేరుతో రీహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కానీ అక్కడే పని జరగకపోతే ఏం లాభం. హార్దిక్ పాండ్యా సహా చాలా మంది క్రికెటర్ల విషయంలో ఇది జరిగింది. ఇక్కడి ఫిజియోలతో పని కాదంటే చెప్పండి.. విదేశాల నుంచి ఫిజియోలను తెప్పిస్తాం. అడ్వాన్సన్ టెక్నాలజీతో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది.'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీపక్ చహర్ ఒక్కడే కాదు.. ఇంతకముందు హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఈ క్రమంలోనే అతను ఫామ్ కోల్పోవడం.. జట్టులో స్థానం కోల్పోవడం జరిగిపోయాయి. జడేజా కూడా బొటనవేలి గాయంతో రీహాబిటేషన్‌లో చాలాకాలం గడపాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లకు చిన్న గాయాలే అయినప్పటికికోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్‌కే అధికారిక ప్రకటన