
బీసీసీఐ ఆధ్వర్యంలోని మహిళల అండర్–19 టీ20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. రాజ్‌కోట్‌లో కేరళ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘సి’ మూడో లీగ్ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
కేరళతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. కావ్య (35; 6 ఫోర్లు), నిధి (25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం.. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 23 రన్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.
హైదరాబాద్ బౌలర్ కేసరి ధృతి 3.4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరో బౌలర్ వైష్ణవి యాదవ్ 2 వికెట్లు తీసుకుంది. ఇక ఆరు జట్లున్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. తదుపరి ఆదివారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్ తలపడనుంది.