తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.
బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు
సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.
నా కఠిన నిర్ణయాల వల్లే ఇలా
నేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్‌గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.
కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్‌నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
సెప్టెంబరు 5 నుంచి
అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు.
చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా!
Comments
Please login to add a commentAdd a comment