![BGT 2023 Ind Vs Aus Final Test: Break Over Rohit Virat Return For Practice - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/8/indvsaus2.jpg.webp?itok=OZeXIGUH)
శుబ్‌మన్ గిల్- ఇషాన్ కిషన్ (PC: BCCI)
India Vs Australia 4th Test: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి అంకానికి ముందు భారత జట్టు సాధన జోరందుకుంది. ఆస్ట్రేలియాతో గురువారంనుంచి జరిగే నాలుగో టెస్టుకు రెండు రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. నిజానికి మంగళవారం ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ అయినా సరే జట్టు ఆటగాళ్లంతా సాధనకు మొగ్గు చూపారు.
యువ బ్యాటర్‌పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యంగా చాలా కాలంగా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విరాట్ కోహ్లి ఎక్కువ సేపు ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాడు. వేర్వేరు పిచ్‌లపై అతను దాదాపు రెండు గంటల పాటు నిరంతరాయంగా సాధన చేయడం విశేషం. మరో వైపు అందరి దృష్టీ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌పై నిలిచింది. కోచ్ ద్రవిడ్ ప్రత్యేకంగా కిషన్ ప్రాక్టీస్‌పై దృష్టి పెడుతూ సూచనలు ఇచ్చాడు.
వికెట్ కీపర్‌గా బెస్ట్.. కానీ
ఇండోర్ టెస్టు అనుభవం తర్వాత భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఈ సారి బ్యాటింగ్ పిచ్‌ను కోరుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కిషన్ దూకుడైన ఆట జట్టుకు అదనపు ప్రయోజనం కలిగించవచ్చని భావిస్తున్నారు. వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అద్భుతంగా ఆకట్టుకున్నా... అతని బ్యాటింగ్ సంతృప్తికరంగా లేదనే వాదన వినిపిస్తోంది.
ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి భరత్ 57 పరుగులే చేశాడు. కీలక సమయాల్లో భరత్ బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడలేదు కాబట్టి కిషన్‌కు అవకాశం దక్కవచ్చని సమాచారం. అయితే కోచ్ ద్రవిడ్ దీనిపై మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తీవ్ర ఒత్తిడి మధ్య, సవాల్‌తో కూడుకున్న పరిస్థితుల్లో భరత్ బాగా కీపింగ్ చేశాడని ప్రశంసించాడు. మరో వైపు మంగళవారం భారత జట్టు సభ్యులంతా ఆడి పాడి హోలీ పండుగను వేడుకగా జరుపుకున్నారు.
డబ్ల్యూటీసీ పాయింట్ల కోసమే...
ఇండోర్ పిచ్‌ను ఐసీసీ ‘నాసిరకం’గా తేల్చి మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించడంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆచితూచి స్పందించాడు. మ్యాచ్ రిఫరీకి తన నివేదిక ఇచ్చే అధికారం ఉందన్న ద్రవిడ్...ప్రపంచవ్యాప్తంగా కూడా పిచ్‌లు ఇదే తరహాలో ఉంటున్నాయని గుర్తు చేశాడు.
‘ఇప్పుడు ప్రతీ సిరీస్‌లో సాధించే వరల్డ్ టెస్టు చాంపియన్ పాయింట్లు ఎంతో కీలకంగా మారాయి. అందుకే అన్ని జట్లు డ్రా కోసం ఫలితం తేల్చే పిచ్‌లు కావాలనే కోరుకుంటున్నాయి. స్వదేశంలో అయితే తమకు కాస్త అనుకూలించే వికెట్ తయారు చేసుకోవడం సహజమే.
ఏ టీమ్ అయినా ఒక టెస్టులో గెలిచి 12 పాయింట్లు సాధించాలని కోరుకుంటుంది తప్ప డ్రా చేసుకొని 4 పాయింట్లతో సరిపెట్టుకోదు. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. మేం దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడు ఆ పిచ్‌లు స్పిన్నర్లకు అసలు ఏమాత్రం అనుకూలించలేదు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: టిమ్ డేవిడ్ ఊచకోత.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషీ, అయినా..!
Gongadi Trisha: మిథాలీ రాజ్, ధోని అంటే ఇష్టం.. పిజ్జా, బర్గర్ తినాలని ఉంటుంది.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment