టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి విఫలమైన తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సిరీస్‌లో టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ కావడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక రాణించకపోతే వీరిద్దరిపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి.
ఒకవేళ అవే నిజమైతే గనుక
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ గురించి ఇటీవల నేను కొన్ని గణాంకాలు చూశాను. గత ఐదేళ్లలో అతడు టెస్టుల్లో కనీసం రెండు లేదంటే మూడు మాత్రమే సెంచరీలు చేసినట్లు సదరు గణాంకాలు సూచిస్తున్నాయి.
అవి సరైనవో కాదో నాకు తెలియదు. ఒకవేళ అవే నిజమైతే గనుక.. ఇది నిజంగా ఆందోళనపడాల్సిన విషయమే. టాపార్డర్ బ్యాటర్‌గా ఉంటూ ఐదేళ్లుగా రెండే టెస్టు శతకాలు బాదారంటే.. అలాంటి ఆటగాడు మరొకరు ఉండరనే అనుకుంటున్నా’’ అని పాంటింగ్ కోహ్లి ఆట తీరును విమర్శించాడు.
ఆసీస్‌పై ఆడటం కోహ్లికి ఇష్టం
ఇక కోహ్లి గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదన్న పాంటింగ్.. ఆస్ట్రేలియాపై ఆడటం అంటే అతడికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. తమ జట్టుపై అతడికి మంచి రికార్డు ఉందని.. ఆసీస్‌తో తొలి టెస్టుతోనే కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో ఇటీవల సొంతగడ్డపై మూడు టెస్టుల్లో కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 0, 70, 1, 17, 4, 1.
దశాబ్దకాలం తర్వాత తొలిసారి
ఈ క్రమంలో దశాబ్దకాలం తర్వాత తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి స్థానం దిగజారింది. పదేళ్లలో తొలిసారిగా అతడు టాప్-20లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరు టెస్టులాడిన కోహ్లి సగటున కేవలం 22 పరుగులు రాబట్టాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లి ఇలా లోయెస్ట్ ఆవరేజ్ నమోదు చేయడం ఇదే తొలిసారి.
ఒకవేళ ఆస్ట్రేలియా గడ్డపై గనుక రాణించకపోతే కోహ్లిపై విమర్శలు మరింత పదునెక్కడం ఖాయం. కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరుతుంది.
చదవండి: IPL 2025: మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment