అలవోకగా షాట్లు కొట్టడంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రత్యేకమైన శైలి. బ్యాటింగ్ ఇంత సులువుగా చేయొచ్చా అన్న రీతిలో.. అంత సొగసుగా ఆడి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఈ ముంబై ఆటగాడు. అయితే, రోహిత్ ఇప్పుడు జట్టుకే భారంగా పరిణమించాడు.
ఆస్ట్రేలియా తో మెల్‌బోర్న్‌లో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో రెండో రోజున బ్యాటింగ్‌కు వచ్చాడు రోహిత్ శర్మ. అయితే, కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మిడాన్ వద్ద.. స్కాట్ బోలాండ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా
ఫలితంగా కేవలం ఎనిమిది పరుగుల వద్ద ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో తొలిసారి ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ ఇలా బాధ్యతారహితంగా వెనుదిరగడం.. ప్రస్తుత అతడి పేలవమైన ఫామ్ గురించి చెప్పకనే చెబుతుంది.
ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్‌లో 5.50 సగటుతో కేవలం 22 పరుగులు (౩, 6, 10, ౩) సాధించాడు. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో మరోసారి చాలా చెత్త షాట్ ఆడి భారత్ జట్టును.. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రమాదంలో పడేసాడు.
చాన్నాళ్లుగా ఇదే పరిస్థితి
టీమిండియాను ముందుండి నడిపించాల్సిన సారథి ఇలాంటి అతి ప్రాధాన్యం ఉన్న ఈ టెస్ట్ సిరీస్‌లో వరుసగా విఫలం కావడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. 37 ఏళ్ళ రోహిత్ ఇప్పటి వరకు 66 టెస్ట్ మ్యాచ్‌లలో 41 .24 సగటుతో మొత్తం 4289 పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకున్న రోహిత్, గత కొద్ది రోజులుగా ఆశించిన స్థాయిలో రాణించకుండా విఫలమవుతూ ఉండటం గమనార్హం.
చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదు
ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో రోహిత్ కొట్టిన షాట్ అతడి ప్రస్తుత ఫామ్ కి అద్దం పడుతోంది. క్రీజులో మందకొడిగా కదులుతూ అతడు అవుటైన తీరుపై పలువురు ప్రఖ్యాత కామెంటేటర్లు విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం, వ్యాఖ్యాత, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) రోహిత్ బ్యాటింగ్ తీరు పై తీవ్ర విమర్శలు చేశాడు.
"రోహిత్ క్రీజులో చాలా మందకొడిగా కనిపించాడు. పైగా అతడు అప్పటికింకా క్రీజులో నిలదొక్కుకోలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అటువంటి షాట్ కొట్టాల్సిన అగత్యం ఎందుకో అర్థం కావడం లేదు. రోహిత్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ కొట్టడంలో దిట్ట.
అటువంటి రోహిత్ కొద్ది సేపు వేచి చూచి పిచ్ తీరు తెన్నులు అర్ధం చేసుకున్న తర్వాత తన షాట్లు కొట్టాల్సింది. అలా కాకుండా ప్రారంభంలోనే ఇలాంటి చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది అతని ప్రస్తుత మానసిక పరిస్థితిని, పేలవమైన ఫామ్ని చెబుతుంది" అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు
నీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది?
మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డారెన్ లీమన్ కూడా రోహిత్ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. "రోహిత్ నువ్వు హిట్ మాన్‌వి. నీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది?
షాట్లు కొట్టడానికి అవుట్ ఫీల్డ్‌లో కావలిసినంత వెసులుబాటు ఉండగా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి చెత్త షాట్ కొట్టి వెనుదిరగడం బాధాకరం" అన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా రోహిత్ వైఖరి పై విమర్శలు చేసాడు.
ఇక ఈ సిరీస్‌లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ వైఫల్యం మరోసారి ఈ ఇన్నింగ్స్‌లో బయటపడింది. రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితిలో భారత్ ని ఆదుకునే బాధ్యత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా పైనే ఉంది.
చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment