
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్‌లో ఓడి, బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.
ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
స్టార్క్‌కు చుక్కలు చూపించిన జైసూ
ఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్‌లో చితకబాదాడు.
మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.
మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్‌గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.
టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు
👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్‌హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు
👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు
👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.
పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీ
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్‌గా 145 పరుగుల లీడ్‌లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్‌మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.
ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
Sometimes JaisWall, sometimes JaisBall! 🔥
Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment