
భారత్, ఆస్ట్రేలియా ఆఖరి టెస్టు పరుగుల బాట పట్టింది. గ్రీన్ శతకం సహాయంతో కంగారూలు భారీ స్కోరు నమోదు చేశారు. ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు రావడం ఈ సిరీస్‌లో ఇదే మొదటిసారి. ఇక మన జట్టు ఎన్ని పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన పది ఓవర్లలో చక్కటి షాట్లతో ఎలాంటి ప్రమాదం లేకుండా రెండో రోజును ముగించిన టీమిండియా... మూడో రోజూ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చెలరేగాల్సి ఉంది.
అహ్మదాబాద్: ఈ సిరీస్‌లో స్పిన్ మాయలో, వికెట్ల వేటలో విజయవంతమైన బౌలర్లకు చివరి టెస్టు కఠినమైన సవాల్ విసురుతోంది. బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించిన మోదీ మైదానంలో రెండో రోజూ పరుగుల జోరు కొనసాగింది. అశ్విన్ (6/91) ఆరు వికెట్లతో ఆకట్టుకోగా... అప్పటికే పర్యాటక ఆసీస్ భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 167.2 ఓవర్లలో 480 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఉస్మాన్ ఖాజా (422 బంతుల్లో 180; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ అవకాశం కోల్పోగా, కామెరాన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) టెస్టు కెరీర్‌లో తొలి శతకం బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ పది ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17 బ్యాటింగ్; 2 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు.
ద్విశతక భాగస్వామ్యం...
రెండో రోజు తొలి సెషన్‌లో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగింది. 255/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఉస్మాన్ ఖాజా– గ్రీన్ జోడీ భారత బౌలింగ్‌పై పైచేయి సాధించింది. దీంతో జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. లంచ్ బ్రేక్‌కు ముందే ఖాజా 150 మార్క్‌ను దాటగా, గ్రీన్ సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచాడు. 347/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగియగా, రెండో సెషన్ మొదలైన కాసేపటికే గ్రీన్ టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. ఐదో వికెట్‌కు ఉస్మాన్ ఖాజా, గ్రీన్ 208 పరు గులు జోడించారు.
1979 తర్వాత భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జోడీ నమోదు చేసిన ద్విశతక భాగస్వామ్యం ఇదే! ఆతిథ్య జట్టును అష్టకష్టాలు పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు అశ్విన్ విడగొట్టాడు. గ్రీన్‌ను అవుట్ చేయడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ ఆఖరి బంతికి క్యారీ (0)ని కూడా పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్టార్క్ (6)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఈ పర్యటనలో తొలిసారి 400 పరుగుల మైలురాయిని చేరుకోగా, 409/7 వద్ద టి విరామానికి వెళ్లారు.
విసిగించిన మర్ఫీ, లయన్
ఆఖరి సెషన్లో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న ఖాజాకు అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. ఇంకేం మిగతా రెండు వికెట్లను కూల్చేయడం సులభమే అనుకున్న భారత్‌కు టెయిలెండర్లు టాడ్ మర్ఫీ (61 బంతుల్లో 41; 5 ఫోర్లు), లయన్ (96 బంతుల్లో 34; 6 ఫోర్లు) చెమటలు పట్టించారు. ఇద్దరు 19.2 ఓవర్లు ఆడటంతో ఆతిథ్య బౌలర్లు శ్రమించక తప్పలేదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై ఈ స్పెషలిస్టు బౌలర్లు చక్కగా బ్యాటింగ్ చేశారు. వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించారు. ఇక ఒక దశలో 500 పరుగులు దాటిస్తారనిపించింది. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ వరుస ఓవర్లలో మర్ఫీ, లయన్‌ను అవుట్ చేయడంతో ఆసీస్ ఆలౌటైంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32; ఖాజా (ఎల్బీ) (బి) అక్షర్ 180; లబుషేన్ (బి) షమీ 3; స్మిత్ (బి) జడేజా 38; హ్యాండ్స్‌కాంబ్ (బి) షమీ 17; గ్రీన్ (సి) భరత్ (బి) అశ్విన్ 114; క్యారీ (సి) అక్షర్ (బి) అశ్విన్ 0; స్టార్క్ (సి) అయ్యర్ (బి) అశ్విన్ 6; లయన్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 34; మర్ఫీ (ఎల్బీ) (బి) అశ్విన్ 41; కునెమన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (167.2 ఓవర్లలో ఆలౌట్) 480.
వికెట్ల పతనం: 1–61, 2–72, 3–151, 4–170, 5–378, 6–378, 7–387, 8–409, 9–479, 10–480.
బౌలింగ్: షమీ 31–3–134–2, ఉమేశ్ 25–2–105–0, అశ్విన్ 47.2–15–91–6, జడేజా 35–5–89–1, అక్షర్ 28–8–47–1, అయ్యర్ 1–0–2–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ బ్యాటింగ్ 17; గిల్ బ్యాటింగ్ 18; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 36. బౌలింగ్: స్టార్క్ 3–1–7–0, గ్రీన్ 2–0–11–0, లయన్ 3–0–14–0, కునెమన్ 2–0–3–0.
611: ఖాజా బ్యాటింగ్ చేసిన నిమిషాలు. భారత్‌లో ఒక ఆసీస్ బ్యాటర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఇదే. ఆసీస్ తరఫున బంతులపరంగా (422) కూడా ఖాజాదే రికార్డు. గతంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు (యూనిస్‌ఖాన్, ఆమ్లా, జయవర్ధనే) మాత్రమే భారత్‌లో 10 గంటలకు పైగా బ్యాటింగ్ చేయగలిగారు.
32: ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టడం ఇది 32వ సారి. భారత గడ్డపై కుంబ్లే (25 సార్లు) పేరిట ఉన్న రికార్డును అతను (26) అధిగమించాడు. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు (113) తీసిన భారత బౌలర్‌గా కూడా కుంబ్లే (111) రికార్డును అశ్విన్ సవరించాడు.
Comments
Please login to add a commentAdd a comment