
ముంబై : ఏ ఆటైనా సరే జట్టుకు కెప్టెన్ ఎంతో అవసరం. జట్టులోని ఆటగాళ్లను ఒకతాటిపై నడిపిస్తూ.. తన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించాలి. జట్టుకు అవసరమైన సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, బౌలర్లకు సలహాలివ్వడం చేస్తుంటారు. ఒక్కోసారి కొందరు ఆటగాళ్లు కెప్టెన్‌గా తాము ఏం చేసినా చెల్లుతుందని ఆదిపత్యం ప్రదర్శించాలని చూస్తుంటారు. కానీ తన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు టైటిళ్లు సాధించిపెట్టిన రోహిత్ ఇలా అనడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ పీటీఐ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (ధోనితో పోలికపై రోహిత్ స్పందన)
‘ఒకవేళ నేను కెప్టెన్ అయితే, జట్టులో అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న ఆటగాడిని నేనేనని భావిస్తాను. ఈ భావన ఒక్కో కెప్టెన్‌కు ఒకో తీరుగా ఉంటుంది. నేను ఇప్పటివరకూ ఇలాంటి సిద్ధాంతంతోనే పనిచేశాను. ఐపీఎల్ టోర్నీలో నాకు చాలావరకు ఇది ఫలితాల్నిచ్చింది. జట్టుకోసం ఫలితాన్ని రాబట్టే ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాను. కెప్టెన్ ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే ఓపిక నశిస్తుంది. ఆటగాళ్లపై నోరు పారేసుకుంటాం. కానీ అది మంచిది కాదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఐపీఎల్‌కు ముందు మాకు చాలా సమయం దొరికింది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నాం. ముంబైలో వర్షాలు, వాతావరణం కారణంగా బయటకు వెళ్లి వర్కౌట్స్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఇంట్లోనే జిమ్ చేస్తున్నాను. దుబాయ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఆడటం అంత తేలికేమీ కాదని’ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. (ధోని రికార్డును బ్రేక్ చేసిన మోర్గాన్)
Comments
Please login to add a commentAdd a comment