సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే! | Captain Dhruv Jurel Beat Virat Kohli And Rohit Team Wins 300 Dollars As Reward, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!.. వీడియో

Published Mon, Dec 23 2024 1:55 PM | Last Updated on Mon, Dec 23 2024 3:20 PM

Captain Jurel Beat Kohli and Rohit Teams Wins 300 Dollars As reward Video

భారత క్రికెటర్లు (PC: BCCI)

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందిన భారత్‌.. అడిలైడ్‌ పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.

బాక్సింగ్‌ డే టెస్టు కోసం సన్నద్ధం
ఇక వర్షం వల్ల బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌- ఆసీస్‌ తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్‌ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌ లైవ్లీ ఫీల్డింగ్‌ డ్రిల్‌తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.

సర్ఫరాజ్‌ ఖాన్‌ కెప్టెన్సీలో కోహ్లి
గ్రూప్‌-1లో భాగంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ కెప్టెన్సీలో విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, హర్షిత్‌ రాణా, యశస్వి జైస్వాల్‌.. గ్రూప్‌-2లో మహ్మద్‌ సిరాజ్‌ సారథ్యంలో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, ఆకాశ్‌ దీప్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. గ్రూప్‌-3లో ధ్రువ్‌ జురెల్‌ నాయకత్వంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్‌మన్‌ గిల్‌, ప్రసిద్‌ క్రిష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌ ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు.

జురెల్‌ సారథ్యంలోని జట్టుదే గెలుపు
అయితే, ఫీల్డింగ్‌తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్‌ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్‌ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్‌ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌ అవుతోంది. కాగా మెల్‌బోర్న్‌లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

అలా అయితేనే ఫైనల్‌ ఆశలు సజీవం
ఇక భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదిక. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్‌ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

ఇక బ్రిస్బేన్‌ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ల రూపంలో ఇద్దరు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండటంతో అశూ​ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. 

చదవండి: పాకిస్తాన్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement