సంవత్సరాలు మారుతున్నాయి... జట్లలో ఆటగాళ్లూ మారుతున్నారు... కొత్తగా కొన్ని జట్లు వచ్చాయి, పోయాయి... మళ్లీ కొత్త జట్లు వచ్చాయి... ఐదు సార్లు విజేతలైనవారు ఒకవైపు ఉంటే ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేక ప్రయత్నం సాగిస్తున్నవారూ మరోవైపు ఉన్నారు... వేలంలో అంకెల లెక్కలకు రెక్కలొచ్చాయి... ఆపై అంబరాన్ని తాకేలా టోర్నీ విలువ పెరుగుతూ పోయింది... ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఏదో రూపంలో ఇందులో భాగమైతే చాలనుకుంటుంటే దేశం తరఫున ఆడతారా లేదా అంటూ విధేయత చూపాల్సి వస్తే ఇక్కడికే వచ్చేందుకే ఆటగాళ్లు సిద్ధమైపోతున్నారు!
ఎన్ని మారినా 14 ఏళ్లుగా మారనిది ఒక్కటే! అదే ఇక్కడ లభించే సంపూర్ణ వినోదం... ఫోర్లు, సిక్సర్లు, పరుగుల పండగ... ఎన్ని ఉద్వేగాలు, మరెన్నో ఉత్కంఠ క్షణాలు... మండు వేసవిలో చల్లని జల్లులా సగటు క్రికెట్ అభిమాని ఉత్సాహంతో ఊగిపోయే క్రికెట్ వేడుక ఇది... అవును! ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది... గత రెండేళ్లు కోవిడ్ దెబ్బకు మైదానాలకు దూరమైన భారత ప్రేక్షకులు టీవీలు, మొబైల్ ఫోన్లలోనే ఆటను ఆస్వాదించగా, ఈసారి నాలుగో వంతుతోనైనా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం దక్కుతోంది. ఇక వచ్చే రెండు నెలలు 74 మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి! –సాక్షి క్రీడా విభాగం
మహారాష్ట్రకే పరిమితం...
కరోనా పరిస్థితులు చక్కబడి దాదాపు అంతా సాధారణంగా మారినా బీసీసీఐ మ్యాచ్‌ల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. ఆటగాళ్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కో వేదిక నుంచి మరో వేదికకు వెళ్లే విమాన ప్రయాణాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పింది. అందుకే టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేసింది. ముంబైలోని మూడు స్టేడియాల్లో (వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్), ముంబైకి చేరువలో రోడ్డు మార్గాన వెళ్లగలిగే పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రేక్షకులను అన్ని మ్యాచ్‌లకు స్టేడియం సామర్థ్యంలో 25 శాతం చొప్పున మాత్రమే అనుమతిస్తున్నారు. ఏ టీమ్‌కూ ‘హోం గ్రౌండ్’ అనుకూలత లేని విధంగా షెడ్యూల్‌ను రూపొందించే ప్రయత్నం చేసినా... ముంబై ఇండియన్స్‌కు మాత్రం వాంఖెడే స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది.
రెండు కొత్త జట్లు
లీగ్‌లో ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా ఐపీఎల్ 15వ సీజన్‌లో రెండు జట్టు కొత్తగా వచ్చాయి. ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన ‘లక్నో సూపర్ జెయింట్స్’... సీవీసీ క్యాపిటల్స్‌కు చెందిన ‘గుజరాత్ టైటాన్స్’ జట్లు ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రతీ ఏటా 60 మ్యాచ్‌లు జరుగుతుండగా, కొత్త జట్ల రాకతో మరో 14 మ్యాచ్‌లు పెరిగి మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 74కు చేరింది.
మారిన ఫార్మాట్
గతంలో ఎనిమిది టీమ్‌లు ప్రతీ జట్టుతో రెండేసిసార్లు తలపడుతూ మొత్తం 14 లీగ్ మ్యాచ్‌ల చొప్పున ఆడేవి. అయితే 10 టీమ్‌లతో ఇదే ఫార్మాట్‌లో ఆడితే టోర్నీ సుదీర్ఘ కాలం సాగే అవకాశం ఉండటంతో ఫార్మాట్‌లో మార్పులు చేశారు. ఈసారి 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో టీమ్ తన గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి సార్లు (మొత్తం 8 మ్యాచ్‌లు), అవతలి గ్రూప్‌లోని ఒక టీమ్‌తో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. దాంతో ఎప్పటిలాగే గరిష్టంగా 14 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.
కొత్త కెప్టెన్లతో...
ఈసారి లీగ్‌లో పలువురు కొత్త కెప్టెన్లు తమ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించుకునే అవకాశం లభించింది. మున్ముందు భారత జట్టుకు నాయకత్వం వహించే అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో వీరంతా సారథులుగా తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. గతంలో సీనియర్ స్థాయిలో ఎన్నడూ సారథిగా వ్యవహరించకపోయినా రవీంద్ర జడేజాకు అనూహ్యంగా ధోని స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ లభించింది. కొత్త టీమ్ గుజరాత్ తమ రాష్ట్రానికి చెందిన ఆటగాడే నాయకుడు కావాలని గట్టిగా కోరుకోవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు కూడా సారథిగా ఇదే తొలి అవకాశం. ఢిల్లీకి గుడ్‌బై చెప్పిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కోల్‌కతా కెప్టెన్‌గా తన ప్రస్థానం ప్రారంభించబోతున్నాడు. కెప్టెన్‌గా కొనసాగించేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తి చూపినా... దానిని తిరస్కరించిన కేఎల్ రాహుల్ ఇప్పుడు లక్నోను నడిపించనున్నాడు. సుదీర్ఘ కాలం నాయకుడిగా ఉంటూ టైటిల్ అందించలేకపోయిన విరాట్ కోహ్లి తప్పుకోవడంతో సీనియర్ డు ప్లెసిస్ ఇప్పుడు కొత్త కెప్టెన్‌గా బెంగళూరు భారం మోస్తున్నాడు.
గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్.
గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్.
రూ. 20 కోట్లు: ఈ ఏడాది ఐపీఎల్ విజేత జట్టుకు లభించే మొత్తం ప్రైజ్‌మనీ.
Comments
Please login to add a commentAdd a comment