కూపర్‌... సూపర్‌ | Connolly leads Punjab Kings to thrilling win over Gujarat Titans | Sakshi
Sakshi News home page

కూపర్‌... సూపర్‌

Apr 1 2026 4:15 AM | Updated on Apr 1 2026 6:55 AM

Connolly leads Punjab Kings to thrilling win over Gujarat Titans

పంజాబ్‌ కింగ్స్‌ను గెలిపించిన కూపర్‌ కనోలీ

44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 నాటౌట్‌

3 వికెట్లతో గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి  

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 163 పరుగుల విజయలక్ష్యం.... పంజాబ్‌ ఒకదశలో 11 ఓవర్లలో 110/2... మిగిలిన 48 బంతుల్లో మరో 53 పరుగులు అంటే అలవోకగా ఛేదించవచ్చు... కానీ ఇక్కడ జట్టు అనూహ్యంగా తడబడింది. 16 బంతుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆ్రస్టేలియన్‌ కూపర్‌ కనోలీ పట్టుదలగా నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో గెలిపించాడు. అంతకుముందు పంజాబ్‌ పదునైన బౌలింగ్‌ ముందు నిలవలేక గుజరాత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.  

న్యూ చండీగఢ్‌: ఐపీఎల్‌లో మూడు ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత ఉత్కంఠభరిత పోరు జరిగింది. మంగళవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం పంజాబ్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కూపర్‌ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగగా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (24 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు.  

బ్యాటింగ్‌ వైఫల్యం! 
బార్ట్‌లెట్‌ ఓవర్లో గిల్‌ మూడు ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించగా, మరో ఓపెనర్‌ సాయిసుదర్శన్‌ (13) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బట్లర్‌ కూడా ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడకపోవడంతో పవర్‌ప్లేలో గుజరాత్‌ 54 పరుగులే చేయగలిగింది. ఇందులో ఒక్క సిక్స్‌ కూడా లేకపోవడం విశేషం. ఆ తర్వాత చహల్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌కు ప్రయత్నించి గిల్‌ వెనుదిరగ్గా, గ్లెన్‌ ఫిలిప్స్‌ (17 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 16వ ఓవర్‌ వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్‌ ప్రభావం కనిపించలేదు. చివరి 4 ఓవర్లలో టైటాన్స్‌ కేవలం 2 ఫోర్లతో 31 పరుగులే రాబట్టగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (18), షారుఖ్‌ ఖాన్‌ (4) కూడా విఫలమయ్యారు.  

రాణించిన ప్రభ్‌సిమ్రన్‌... 
ఛేదనలో ఆరంభంలోనే ప్రియాన్‌‡్ష ఆర్య (7) వెనుదిరిగినా... ప్రభ్‌ సిమ్రన్‌ సిక్సర్లతో చెలరేగాడు. రబాడ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను, సుందర్‌ బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే కీలక సమయంలో గుజరాత్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి పంజాబ్‌పై ఒత్తిడి పెంచింది. కానీ కనోలీ పోరాటంతో మ్యాచ్‌ పంజాబ్‌ వశమైంది.  

అశోక్‌ అరంగేట్రం... 
రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల అశోక్‌ శర్మ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేసే ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కేవలం 15.63 సగటుతో 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 2022లో కోల్‌కతా, 2025లో రాజస్తాన్‌ జట్లలో ఉన్నా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.  

స్కోరు వివరాలు  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (సి) అయ్యర్‌ (బి) యాన్సెన్‌ 13; గిల్‌ (సి) కనోలీ (బి) చహల్‌ 39; బట్లర్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) చహల్‌ 38; ఫిలిప్స్‌ (సి) యాన్సెన్‌ (బి) వైశాక్‌ 25; సుందర్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) వైశాక్‌ 18, షారుఖ్‌ (సి) 
అర్ష్‌దీప్‌ (బి) వైశాక్‌ 4; తెవాటియా (నాటౌట్‌) 11; రషీద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–37, 2–83, 3–119, 4–129, 5–144, 6–150.
బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4–0–42–0, బార్ట్‌లెట్‌ 4–0–36–0, యాన్సెన్‌ 4–0–20–1, వైశాక్‌ 4–0–34–3, చహల్‌ 4–0–28–2,  
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్‌‡్ష (సి) అశోక్‌ (బి) రబాడ 7; ప్రభ్‌సిమ్రన్‌ (సి) ప్రసిధ్‌ (బి) రషీద్‌ 37; కనోలీ (నాటౌట్‌) 72; శ్రేయస్‌ (సి) సుందర్‌ (బి) ప్రసిధ్‌ 18; వధేరా (సి) గిల్‌ (బి) సుందర్‌ 3; శశాంక్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిధ్‌ 4; స్టొయినిస్‌ (సి) రషీద్‌ (బి) ప్రసిధ్‌ 0; యాన్సెన్‌ (సి) గిల్‌ (బి) అశోక్‌ 9; బార్ట్‌లెట్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 165.  
వికెట్ల పతనం: 1–7, 2–83, 3–110, 4–113, 5–118, 6–118, 7–144. బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–15–0 రబాడ 3–0–34–1, అశోక్‌ శర్మ 3–0–31–1, రషీద్‌ 4–0–29–1, సుందర్‌ 3.1–0–27–1, ప్రసిధ్‌ 4–0–29–3.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement