కొటాబహరు (మలేసియా): భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించి అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. తన చిరకాల స్నేహితురాలు, మలేసియా దేశానికి చెందిన ఇలి నజ్వా సిద్దీఖీని గత బుధవారం జలంధర్‌లో మన్‌ప్రీత్ పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయితే దీనిపైనే మలేసియా దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం మహిళ అయిన నజ్వా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమిటని, ఆమె మతం మార్చుకుందా అంటూ ప్రశ్నలు వచ్చాయి. చివరకు ఇందులో మలేసియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
కరోనా కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పెళ్లి కోసమంటూ నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే మలేసియా ఉప ప్రధాని (మత వ్యవహారాలు) అహ్మద్ మర్జుక్ మాత్రం తమకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని...నజ్వా స్వదేశానికి తిరిగొచ్చి అన్ని అంశాలపై స్పష్టతనివ్వాల్సి ఉందని చెప్పారు. ‘ఇలి నజ్వా సొంత రాష్ట్రం జొహర్ ప్రభుత్వ అధికారుల నుంచి మరిన్ని వివరాలు కోరాం. ప్రస్తుతానికి మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆమె ముస్లిం. ఇంకా మతం మారలేదు. విదేశంలో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఆమె ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు పంపించలేదు. ఆమె ముస్లింగానే ఉంటూ పంజాబీ తరహా పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పు చేసినట్లుగానే భావిస్తాం’ అని మర్జుక్ అన్నారు. తాజా వివాదంపై అధికారికంగా నజ్వా కానీ మన్‌ప్రీత్ సింగ్ కానీ ఇంకా స్పందించలేదు.
మన్‌ప్రీత్ పెళ్లిపై వివాదం
Published Tue, Dec 22 2020 4:39 AM | Last Updated on Tue, Dec 22 2020 1:17 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment