ముంబై: మహమ్మారి కరోనాపై పోరులో అండగా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ 10 లీటర్ల సామర్థ్యం గల 2 వేల ఆక్సిజన్ కాన్‌సంట్రేటర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... ‘‘వైరస్‌పై పోరాటంలో వైద్య సిబ్బంది పోషిస్తున్న పాత్ర మరువలేనిది. మనల్ని కాపాడటం కోసం ముందుండి పోరాడుతున్న వాళ్లు నిజమైన ఫ్రంట్‌లైన్ వారియర్లు. వైద్యారోగ్యం అంశానికి బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది.
ఇందులో భాగంగా ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వాళ్లు త్వరగా కోలుకునేలా తన వంతు తక్షణ సాయం ప్రకటించింది’’అని పేర్కొన్నారు. ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా.. ‘‘కోవిడ్‌పై జాతి సమిష్టి యుద్ధంలో చేయి కలిపి నిలబడతాం. కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న బాధితుల గురించి, వైద్య పరికరాల కొరత గురించి బీసీసీఐకి అవగాహన ఉంది. బోర్డు తన వంతు సహాయం చేస్తుంది. వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment