బెల్‌గ్రేడ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిఫరీ నిర్ణయంపై ఆగ్రహంతో మైదానంలో విసిరేసిన కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ (చేతికి ధరించేది) 64 వేల యూరోల (రూ. 55 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గత ఆదివారం పోర్చుగల్, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆట అదనపు సమయంలో తాను కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించడంతో ఆగ్రహించిన రొనాల్డో... తన చేతికి ఉన్న నీలి రంగు ఆర్మ్‌బ్యాండ్‌ను విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న ఫైర్ ఫైటర్ ఒక చారిటీ సంస్థకి అందజేశాడు. వాళ్లు దానిని ఆన్‌లైన్ వేలంలో ఉంచడంతో ఒక అభిమాని పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం వినియోగిస్తామని ఆ చారిటీ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment