
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఏదీ కలిసి రావడం లేదు. ఇటీవలే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో అతన్ని బయటకు సాగనంపడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. తాజాగా రొనాల్డోకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రొనాల్డోకు 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) జరిమానా, రెండు మ్యాచ్‌లపై నిషేధం విధించడం షాక్‌కు గురి చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ ఘనాతో పోర్చుగల్ తలపడనుంది. ఈ నేపథ్యంలో రొనాల్డోపై నిషేధం అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది.
అయితే ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ నిషేధం వర్తించదు. ఒక రకంగా ఇది పోర్చుగల్‌తో పాటు రొనాల్డోకు పెద్ద ఊరట. మాంచెస్టర్ యునైటెడ్ తనను వదిలేసిన తర్వాత ప్రస్తుతం రొనాల్డో ఫ్రీ ఏజెంట్‌గా ఉన్నాడు. రొనాల్డో మళ్లీ ఏదైనా క్లబ్‌కు ఆడితే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడబోతోన్నాడన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అర్జెంటీనా, జర్మనీలాంటి టీమ్స్‌కు తొలి మ్యాచ్‌లలోనే షాక్‌లు తగిలిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.
ఇక గత ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్‌ను కూడా 1-0తో ఎవర్టన్ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్ కెమెరాల్లో బందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎవర్టన్ ఎఫ్‌సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్‌ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. అతని చర్యను తప్పిదంగా భావించిన బ్రిటీష్ పోలీసులు రొనాల్డో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే అప్పట్లోనే పోలీసులు రొనాల్డోను హెచ్చరికతో వదిలేశారు.
తాజాగా ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దీనిపై విచారణ జరిపి.. రొనాల్డోకు జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.రొనాల్డో ప్రవర్తన సరి కాదని, దురుసుగా ఉన్నదని ఓ స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ తేల్చినట్లు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వెల్లడించింది. తాను తన భద్రత కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని నవంబర్ 8 న ఈ కమిషన్ ముందు హాజరై రొనాల్డో చెప్పాడు. కానీ భయంతో కాకుండా ఓడిన ఫ్రస్ట్రేషన్‌లో అతడు ఇలా చేసినట్లు కమిషన్ గుర్తించింది.
చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు
దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్