పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు తన చర్యతో అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో కాస్త కొత్తగా కనిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపుల తర్వాత అల్-నసర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న రొనాల్డో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు.
ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడినప్పటికి ఆ తర్వాత అల్-నసర్ వరుస విజయాలతో దుమ్మురేపింది. అయితే సౌదీ ప్రోలీగ్‌లో భాగంగా శుక్రవారం అల్-ఇత్తిహాద్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో సేన 1-0తో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పాత రొనాల్డో బయటికి వచ్చేశాడు. సహనం కోల్పోయిన రొనాల్డో పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా కనిపించిన వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడు. దెబ్బకు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురయ్యాయి. ఒక వాటిర్ బాటిల్ ఎగిరి అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి ఆ బాటిల్ తగల్లేదు.
అయితే రొనాల్డో చర్యను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయనంత మాత్రానా ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కోపంలో చేసే పని ఒక్కోసారి చేటు తెస్తుందని.. అందుకే కోపం తగ్గించుకుంటే మంచిదని హితబోధ చేశారు. అయితే రొనాల్డో కోపానికి ఇంకో కారణం కూడా ఉందని తెలిసింది.
అదేంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు అల్-ఇత్తిహాద్ జట్టు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ నామస్మరణ చేశారు. రొనాల్డో కనిపించిన ప్రతీసారి మెస్సీ పేరు అతనికి వినపడేలా గట్టిగట్టిగా అరిచారు. ఈ చర్య కూడా అతని కోపానికి ఒక కారణం కావొచ్చు అని కొందరు పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల సిగ్గుపడిన రొనాల్డో కాసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అభిమానులను క్షమాపణ కోరాడు.
ఇక మ్యాచ్‌లో ఆట 10వ నిమిషంలో అల్-ఇత్తిహాద్ తరపున బ్రెజిల్‌కు చెందిన రొమారినో గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు జరిపినప్పటికి మరో గోల్ రాలేదు.
— Out Of Context Football (@nocontextfooty) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment