అబుదాబి: ఐపీఎల్-13 వ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్ పవర్ చూపించగా, డుప్లెసిస్(58 నాటౌట్; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో సీఎస్‌కేను రాయుడు, డుప్లెసిస్‌లు ఆదుకున్నారు. ఈ జోడి 115 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో ఆల్‌రౌండర్ సామ్ కరాన్ ఆరు బంతుల్లో రెండు సిక్స్‌లు, 1 సిక్స్‌తో బ్యాట్ ఝుళిపించాడు. బౌల్ట్ వేసిన 20 ఓవర్ తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్ వరుసగా ఫోర్లు కొట్టడంతో చెన్నై ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.(చదవండి: జడేజా మ్యాజిక్.. డుప్లెసిస్ సూపర్)
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్‌కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్(1), షేన్ వాట్సన్(4) వికెట్‌లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్ ఎవరైనా టైమింగ్‌తో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్‌కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్‌లోకి వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్‌ను పాటిన్‌సన్ ఎల్బీగా పెవిలియన్‌కు పంపగా, మురళీ విజయ్‌ను బౌల్ట్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో రెండో ఓవర్‌లోనే సీఎస్‌కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్‌గా ఔటయ్యాడు.(చదవండి: ధాటిగా బ్యాటింగ్.. అంతలోనే!)
ఈ మ్యాచ్‌లో తొలుత సీఎస్‌కే టాస్ గెలవడం ద్వారా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 162 పరుగులు చేసింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే రోహిత్ ఫోర్ కొట్టాడు. ఆపై డీకాక్‌కు కూడా బ్యాట్ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్‌రేట్‌ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. సీఎస్‌కే స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన ఐదో ఓవర్ నాల్గో బంతికి రోహిత్(12) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, క్వింటాన్ డీకాక్(33) ఆ తర్వాత ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. పేసర్ సామ్ కరాన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి డీకాక్(33) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. డీకాక్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు.
కరాన్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్.. వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్(17), సౌరవ్ తివారీల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. అప్పుడు తివారీకి హార్దిక్ పాండ్యా కలవడంతో స్కోరు కాసేపు పరుగులు పెట్టింది. కానీ అది ఎంతోసేపు సాగలేదు. తివారీ,హార్దిక్‌లు వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కృనాల్, పొలార్డ్‌లు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు సాధించారు, సామ్ కరాన్, పీయూష్ చావ్లా తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment