Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్‌తో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్‌రేట్ సీఎస్‌కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్‌కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది.
ఇదిలా ఉంటే ధోని ఫిట్‌నెస్‌పై సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్‌తో మాట్లాడాడు.
ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్‌కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్‌ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు.
కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్‌ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్‌క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్‌కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్‌కు దూరమైతే సీఎస్‌కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్‌నెస్‌పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు.
చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని!
Comments
Please login to add a commentAdd a comment