వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన ఆరాధ్య ఆటగాడు సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును (49 సెంచరీలు) సమం చేసిన తర్వాత వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ మళ్లీ మొదలైంది. కోహ్లి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటి నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త బ్రేక్ పడింది. కోహ్లి పేలవ ఫామ్‌లో ఉండి, దాదాపు మూడేళ్ల పాటు సెంచరీ చేయలేక అవస్థ పడుతున్నప్పుడు కోహ్లి పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఆతర్వాత కోహ్లి అనూహ్యంగా పుంజుకుని మునుపటికంటే డేంజర్‌గా కనపడుతుండటంతో ఈ చర్చ మళ్లీ మొదటికొచ్చింది.
అంకెల ప్రకారం చూస్తే.. సచిన్, కోహ్లి సమానంగా (49 సెంచరీలు) కనిపిస్తున్నారు. త్వరలో కోహ్లి దీనిని అధిగమించే అవకాశం ఉంది. మరి వన్డేల్లో సచిన్ కంటే కోహ్లి గొప్ప బ్యాటరా? నిజానికి రెండు వేర్వేరు తరాల ఆటగాళ్లను పోల్చడమే అసహజం. సులువైన పిచ్‌లు, మారిన నిబంధనలు, ఫీల్డింగ్ పరిమితులు, రెండు బంతుల వాడకం... ఇలా అప్పటి సచిన్‌కంటే ఇప్పుడు కోహ్లికి సహజంగానే కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అన్నింటికి మించి సచిన్ సమయంలో అతనొక్కడే జట్టు భారాన్ని సుదీర్ఘ సమయం పాటు మోశాడు. రిస్క్‌కు అవకాశం తక్కువ.
కానీ కోహ్లికి సమర్థులైన ఇతర సహచరుల అండ ఉండటం అతనిపై ఒత్తిడిని తగ్గించింది. సచిన్ 32 సెంచరీల సమయంలో జట్టులో మరెవరూ సెంచరీలు చేయలేదు. కానీ కోహ్లి 22సార్లు మాత్రమే ఇలాంటి ఫీట్ నమోదు చేయడం ఆ తేడాను చూపిస్తోంది. అయితే ఇదంతా కోహ్లి చేతుల్లో లేనిది. ఇది అతని ఘనతను తగ్గించలేదు. తనకు ఎదురైన ప్రత్యర్థి ఎవరైనా వారిపై విరుచుకుపడటమే అతనికి తెలిసింది.
సచిన్ ఓవరాల్ 100 సెంచరీలను కోహ్లి అందుకుంటాడా అనేది తర్వాతి చర్చ. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 79 శతకాలు ఉన్నాయి. మరో 21 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును సమం చేస్తాడు. సచిన్‌కు (51), కోహ్లికి (29) మధ్య టెస్టులో అంతరం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. వన్డే ఫామ్‌తో కోహ్లి, సచిన్ రికార్డును చేరుకోవడం అసాధ్యం కాకపోవచ్చు. కాగా, 49 సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 451 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
మరో మూడేళ్ల వరకు ఢోకా లేదు..
ఫిట్‌నెస్ పరంగా చూసినా కోహ్లి మరో మూడేళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించడానికి ఢోకా లేదనిపిస్తుంది. నిన్ననే 35వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లి.. ఫిట్‌నెస్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు కాబట్టి 38, 39 ఏళ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈలోపు అతనికి సచిన్ రికార్డును చేరుకోవడం అంత కష్టమైన పని కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫామ్ మరో ఏడాది పాటు కొనసాగితే కోహ్లి 90ల్లోకి (సెంచరీలు) చేరుకోవడం ఖాయం.
కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ (121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు) రికార్డు సెంచరీతో అదరగొట్టడంతో భారత్.. దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment