వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును (వన్డేల్లో 49 సెంచరీలు) సమం చేసిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో విరాట్ (121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు) రికార్డు సెంచరీతో (49వ సెంచరీ) టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. విరాట్‌కు జతగా రవీంద్ర జడేజా బంతితో చెలరేగడంతో (9-1-33-5) భారత్ సౌతాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ శతక్కొట్టుడు, శ్రేయస్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (77), రోహిత్ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. జడేజా మాయాజాలం దెబ్బకు 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది.
విరాట్ కోహ్లి భావోద్వేగం..
సచిన్ రికార్డు సమం చేసిన అనంతరం విరాట్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ ఇలా అన్నాడు. భారత్ తరఫున ఆడేందుకు వచ్చే ప్రతీ అవకాశం గొప్పదే. నా హీరో రికార్డును సమం చేయడం గౌరవంగా భావిస్తున్నా. బ్యాటింగ్‌లో ఆయన ఓ పర్ఫెక్షనిస్ట్. ప్రజలు పోలికలను ఇష్టపడతారు కానీ, నేను సచిన్ అంత గొప్ప ఆటగాడిని కాను. నాకు ఇది భావోద్వేగంతో కూడిన సందర్భం.
ఇంత ఆనందాన్ని ఒకేసారి తట్టుకోవడం కష్టంగా ఉంది. సచిన్ అభినందన ఎంతో ప్రత్యేకం. నేను సచిన్ ఆటను టీవీలో చూస్తూ పెరిగాను. అలాంటిది ఇప్పుడు స్వయంగా ఆయన ప్రశంసలు అందుకోవడం నా దృష్టిలో అమూల్యం. నా పుట్టిన రోజున శతకం సాధించడం కలగా ఉంది. అభిమానులు దీనిని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఇలాంటివి నాకు దక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు.
Comments
Please login to add a commentAdd a comment