ICC Cricket World Cup 2023- India Beat Australia: స్వదేశంలో వన్డే ప్రపంచకప్-2023 టోర్నీని టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తమ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేసింది.
ఈ క్రమంలో జస్‌ప్రీత్ బుమ్రా మూడో ఓవర్ రెండో బంతికి ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ డేవిడ్ వార్నర్(41) వికెట్ తీశాడు.
జడ్డూకు 3 వికెట్లు
అనంతరం 27.1 ఓవర్లో రవీంద్ర జడేజా స్టీవ్ స్మిత్(46)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 30వ ఓవర్ రెండో బంతికి మార్నస్ లబుషేన్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో అలెక్స్ క్యారీ(0)ని ఎల్బీడబ్ల్యూ చేశాడు.
ఇక మరోసారి కుల్దీప్ తన మాయాజాలంతో గ్లెన్ మాక్స్‌వెల్(15)ను బౌల్డ్ చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ కామెరాన్ గ్రీన్(8) పనిపట్టాడు. మరోసారి రంగంలోకి దిగిన బుమ్రా.. జోరుగా ఆడుతున్న కమిన్స్(15)ను పెవిలియన్‌కు పంపగా.. హార్దిక్ పాండ్యా ఆడం జంపా(6) వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 49.3వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ మిచెల్ స్టార్క్(28)ను అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసింది.
ఆరంభంలోనే షాకులు
భారత బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వరుసగా డకౌట్ అయ్యారు.
పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టీమిండియాను ఆదుకున్నారు. వరల్డ్‌కప్ చరిత్రలో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు.
ఆదుకున్న కోహ్లి, రాహుల్
సిక్సర్లకు యత్నించకుండా కేవలం ఫోర్లు బాదుతూ.. ఆచితూచి ఆడుతూ ఒక్కో పరుగు పోగుచేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 116 బంతులు ఎదుర్కొని 85 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు బౌండరీలు ఉన్నాయి.
కాగా 38వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లి అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ సిక్సర్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. రాహుల్ 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలవగా.. హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 1 సిక్సర్ సాయంతో 11 పరుగులు చేశాడు.
పాండ్యా మెరుపులు
దీంతో 41.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరల్డ్‌కప్-2023లో బోణీ కొట్టింది. ఆద్యంతం అద్భుతంగా ఆడిన రాహుల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన కోహ్లి.. సచిన్ రికార్డు బ్రేక్! అరుదైన ఘనత
Comments
Please login to add a commentAdd a comment