
చెపాక్ మైదానం నుంచి జార్వోను బయటకు పంపుతున్న సిబ్బంది (PC: X)
ICC Cricket World Cup 2023- India vs Australia: డేనియల్ జార్విస్ అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు గానీ.. జార్వో 69 అంటే క్రికెట్ ప్రేమికులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. భద్రతా సిబ్బందిని తప్పించుకుని మైదానంలో చొరబడటం ఇతడికి అలవాటు.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చెన్నైలో టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగానూ ఇదే పనిచేశాడు జార్వో. టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి దూసుకువచ్చాడు. దీంతో ఆటకు అంతరాయం కలిగింది.
వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి అతడిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా.. జార్వో నిరాకరించాడు. ఇంతలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వచ్చి అతడిని బయటకు వెళ్లమని చెప్పగా.. సెక్యూరిటీ అతడిని లాక్కొని వెళ్లారు.
నిషేధం విధించిన ఐసీసీ
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అని చెప్పుకొనే జార్వో చేసే ఇలాంటి పిచ్చి పనులు.. ఈ ప్రాంక్‌స్టార్ అభిమానులకు నచ్చుతాయేమో గానీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి మాత్రం ఇతడి చర్యలు విసుగుతెప్పించాయి. దీంతో అతడిని వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్‌ల నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు.. ‘‘ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023లో భాగమైన ప్రతి ఒక్కరి భద్రత మాకు ముఖ్యం. ఈరోజు మైదానంలో ఏం జరిగిందో మేము అధికారులను అడిగి తెలుసుకున్నాం.
ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం
భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే ఈ మెగా ఈవెంట్ తదుపరి మ్యాచ్‌లకు అతడు హాజరుకాకుండా నిషేధిస్తున్నాం. ప్రస్తుతం ఈ అంశం భారత అధికారుల పరిధిలో ఉంది’’ అని ఐసీసీ ఆదివారం నాటి ప్రకటనలో తెలిపింది.
కాగా ఇంగ్లండ్‌కు చెందిన జార్వో 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండు, నాలుగో టెస్టు సందర్భంగానూ ఇలాగే ఆటకు అంతరాయం కలిగించాడు. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్ సందర్భంగా ఇలాగే వ్యవహరించడంతో భద్రతా కారణాల దృష్ట్యా జార్వోను బ్యాన్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంక్‌స్టార్‌పై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.
‘‘ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం.. .. కనీసం మ్యాచ్‌లు నేరుగా చూసే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటివి అవసరమా భయ్యా!’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా విజయంతో ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించింది.
చదవండి: ODI WC 2023 Ind Vs Afg: ఇంకా చెన్నైలోనే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు దూరం: బీసీసీఐ ప్రకటన