
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 ఫైనల్లో నెదర్లాండ్స్ బౌలర్లు లంకేయులను కట్టడి చేశారు. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓ దశలో (35.3 ఓవర్లలో 180/3) పటిష్ట స్థితిలో ఉండింది. అయితే ఆ జట్టు 10 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు.
ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాదించిన శ్రీలంక, నెదర్లాండ్స్..
ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఇదివరకే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు.. భారత్ సహా 8 జట్లతో తలపడతాయి. క్వాలిఫయర్స్‌లో రెండో బెర్తు కోసం జింబాబ్వే, స్కాట్లాండ్‌ల నుంచి తీవ్రపోటీ ఎదుర్కొన్న నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరి, ఇక్కడ ఓటమి ఎదరుగని శ్రీలంకకు చుక్కలు చూపించింది. లంక నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేదించగలిగితే చరిత్ర సృష్టించినట్లవుతుంది.