Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే పరమావధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 583 పరుగులు సాధించి రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అయితే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో రాజస్తాన్ ఆడిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో వైభవ్ నిరాశ పరిచాడు. చాహర్ వేసిన లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరబడిన వైభవ్ సూర్యవంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది.
బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన నమన్ ధిర్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో వైభవ్ వికెట్ తీయగానే దీపక్ చాహర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హమ్మయ్యా ఔట్ చేశాను' అన్న తరహాలో చాహర్ సైగలు చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాహర్ వింత సెలబ్రేషన్ వెనుక ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆటను ప్రదర్శించాడు. క్షణాల్లో ఆటను మార్చేసి ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ అతని ఇంపాక్ట్ ఆటపై బలంగా ప్రభావం చూపించేది.
అందుకే వైభవ్‌ను ఆరంభంలోనే ఔట్ చేయాలని అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇదే సీజన్‌లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్‌లోనూ వైభవ్ 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలింగ్ దళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీపక్ చాహన్ ఈసారి పక్కా ప్రణాళికతో వైభవ్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. అందుకే పట్టరాని సంతోషంతో వినూత్న రీతిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు.
2025 సీజన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ మంచి ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, ఈ సీజన్‌లో అతడి బలహీనతలు బయటపడతాయని అన్ని జట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీజన్ ఆద్యంతం విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు.
— crictalk (@crictalk7) May 24, 2026
చదవండి: వెల్ డన్ అర్జున్.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్


