చివరి లీగ్ మ్యాచ్‌లో ఘన విజయం
7 వికెట్లతో గుజరాత్ జెయింట్స్ ఓటమి
రేపు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్
న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఏడాది తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 గెలిచిన ఢిల్లీ 12 పాయింట్లతో టాపర్‌గా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పట్టికలో చివరి స్థానంతో గుజరాత్ ఈ సీజన్‌ను ముగించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. భారతి ఫుల్‌మలి (36 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...కాథరీన్ బ్రైస్ (22 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో జట్టు స్కోరు 48/5 కాగా... భారతి, బ్రైస్ ఆరో వికెట్‌కు 50 బంతుల్లో 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణి, మరిజాన్ కాప్, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు వేగంలో అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరు ప్రదర్శించింది. షఫాలీ, జెమీమా మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేశారు. విజయానికి 2 పరుగుల దూరంలో షఫాలీ వెనుదిరిగినా... జెమీమా ఫోర్ కొట్టడంతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే క్యాపిటల్స్ జట్టుకు గెలుపు దక్కింది.
ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థిని నిర్ణయించే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ రేపు జరుగుతుంది. గత ఏడాది చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘ఎలిమినేటర్’ పోరులో తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా... చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్‌తో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment