మూడో విజయంతో అగ్రస్థానానికి
రాణించిన మెగ్ లానింగ్, జెస్ జొనాసెన్, రాధా యాదవ్
వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిన గుజరాత్ జెయింట్స్
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన తర్వాత క్యాపిటల్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే గుజరాత్ పరిస్థితి మాత్రం మరింత దిగజారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఒక్క గెలుపు కూడా లేకుండా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 చేయగా.... జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది.
ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. షఫాలీ వర్మ (13), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలం కావడంతో లానింగ్ ముందుండి నడిపించింది. అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 27; 5 ఫోర్లు)తో రెండో వికెట్‌కు లానింగ్ 26 బంతుల్లో 38 పరుగులు జోడించగా... చివర్లో అనాబెల్ సదర్లాండ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని కీలక పరుగులు జత చేసింది. గుజరాత్ పేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు వదిలేయడం కలిసొచ్చినా ఢిల్లీ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది.
ఒకదశలో 105/2తో మెరుగైన స్థితిలో నిలిచిన జట్టు ఆ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 33 పరుగులు చేసింది. జెయింట్స్ పేసర్ మేఘనా సింగ్ (4/37) కీలక వికెట్లు తీయగా... గార్డ్‌నర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ తడపడింది. సున్నా స్కోరు వద్దే వాల్‌వార్ట్ (0) వెనుదిరగ్గా... బెత్ మూనీ (12), లిచ్‌ఫీల్డ్ (15), వేద కృష్ణమూర్తి (12) ప్రభావం చూపలేకపోయారు. అయితే యాష్లీ గార్డ్‌నర్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడగలిగింది.
అయితే 35 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో జెస్ జొనాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గార్డ్‌నర్ స్టంపౌట్ కావడంతో గుజరాత్ ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ లాంఛనమే అయింది. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జొనాసెన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. లీగ్ దశలో తొలి అర్ధ భాగం మ్యాచ్‌లు (11) నేటితో బెంగళూరులో ముగియనున్నాయి. మంగళవారం నుంచి తర్వాతి 11 మ్యాచ్‌లకు ఢిల్లీ వేదిక కానుంది.
తొలి కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్
ఆదివారం మ్యాచ్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్‌కు చెందిన సయాలీ సద్‌గరే గుర్తింపు తెచ్చుకుంది. జెయింట్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ బ్యాటర్ జొనాసెన్ షాట్ కొట్టగా డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్‌ను అందుకునే క్రమంలో హేమలత పట్టు తప్పింది. క్యాచ్ చేజారగా... బంతి ఆమె నుదుటికి బలంగా తాకింది. దాంతో కన్‌కషన్‌తో హేమలత మైదానం వీడింది. గుజరాత్ తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సయాలీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment