సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ క్రీడలు, మహిళలు, బంగారు పతకాలు అనగానే క్రీడాభిమానులకు ఠక్కున గుర్తొచ్చేపేరు పరుగుల రాణి పీటీ ఉష. అభిమానులు పయోలి ఎక్స్‌ప్రెస్‌గా పిల్చుకునే పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం 101 స్వర్ణ పతకాలను సాధించారంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా ట్రాక్ అండ్కే ఫీల్డ్‌లో కేరళ కుట్టీ పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష 1979 నుంచి దేశానికి పలు విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, రజిత పతకం సాధించి రికార్డు సృష్టించిన ఉష తృటిలో ఒలంపిక్స్ పతకాన్నిచేజార్చుకున్నారు. అవును నిజం.
1980 రష్యా ఒలంపిక్స్ ఉషకుపెద్దగా కలిసిరాలేదు. అయితే 1984 ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలని ఆశించారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్లో జరిగిన క్రీడలలో ఉష సెమీఫైనల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచినా, పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయారు. సెకనులో వందోవంతు (0.01) తేడాతో కాంస్య పతకం పొందే అవకాశం జారవిడుచుకున్న విషయం అప్పట్లో భారతీయులను చాలా కాలం వెంటాడింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్కు కలిగిన దురదృష్టమే పీటీ ఉషకు కూడా ఎదురైందని భావించారు. అయితే ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ,అర్జున అవార్డులతో సత్కరించింది.
కాగా టోక్యో ఒలింపిక్ భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభం రోజునే పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ఖ్యాతి గడించారు.
Comments
Please login to add a commentAdd a comment