
25న ఏర్పాటు చేసిన ఐఓఏ చీఫ్ పీటీ ఉష
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లోని సహచరులతో ఏర్పడిన వైరంతో ఇబ్బంది పడుతున్న ఐఓసీ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 25న జరగబోయే ఈ మీటింగ్‌లో సమస్యలు, విబేధాలు, ఇతరత్రా అంశాలపై చర్చిద్దామని ఆమె పేర్కొంది. ‘వివాదానికి దారి తీసిన అంశాలు, అసాధారణ సమస్యలు... ఇలా అన్నింటిపై చర్చించేందుకు ఎస్‌జీఎం నిర్వహించాలని నిర్ణయించాను.
ఈ నెల 25న ఆఫీస్ బేరర్లు, స్టేక్ హోల్డర్లంతా హాజరు కావాలని కోరుతున్నాను. ఈ ఎస్‌జీఎం హైబ్రిడ్ మీటింగ్. అంటే నియమావళిలోని ఆర్టికల్ 8.3 ప్రకారం ఎవరైనా సభ్యులు ప్రత్యక్షంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటే ఆన్‌లైన్ మీటింగ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఐఓఏ వెబ్‌సైట్‌లో ఉంటుంది’ అని ఉష ఐఓఏ సభ్యులకు ఈ–మెయిల్ పంపారు. ముఖ్యంగా ఒలింపిక్ సంఘానికి సీఈఓగా రఘురామ్ అయ్యర్‌ను నియమించడాన్ని ఎగ్జిక్యూటివ్ (ఈసీ) సభ్యులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోతున్నారు.
తాము ఎంతగా వ్యతిరేకించినా ఆయనకు పదవిని కట్టబెట్టడంపై ఈసీ సభ్యులంతా గుర్రుగా ఉన్నారు. కోశాధికారి సహదేవ్ యాదవ్‌పై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది. ఈ లుకలుకలతో ఐఓఏ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. మరోవైపు ఐఓఏను ఒక ప్రొఫెషనల్ దృక్పథంలో నడిపించేందుకు సీఈఓ అవసరం ఎంతో ఉందని ఉష వాదిస్తోంది.
అయ్యర్‌కు సీఈఓ పదవేమీ పూర్తిగా కొత్తేం కాదు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ లీగ్, అల్టీమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లకు సీఈఓ పనిచేసిన విశేషానుభవం రఘురామ్ అయ్యర్ సొంతం. ఐఓఏ నిర్వహించే ఎస్‌జీఎంలో స్పోర్ట్స్ కోడ్‌పై కూడా చర్చ జరిగే అవకాశముంది. గరిష్ట వయోపరిమితిపై ప్రధానంగా చర్చిస్తారు.