Vinesh Phogat: స్పందించిన ఒలింపిక్‌ సంఘం.. కీలక వ్యాఖ్యలు | Olympics: IOA President PT Usha Key Comments On Vinesh Phogat Disqualification | Sakshi
Sakshi News home page

Vinesh Phogat: స్పందించిన పీటీ ఉష.. కీలక వ్యాఖ్యలు

Published Wed, Aug 7 2024 4:14 PM | Last Updated on Wed, Aug 7 2024 4:42 PM

Olympics: IOA President PT Usha Key Comments On Vinesh Phogat Disqualification

మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అనర్హత వేటుపై భారత ఒలింపిక్‌ సంఘం(IOA) అధ్యక్షురాలు పీటీ ఉష స్పందించారు. ఇలాంటి పరిణామాన్ని అస్సలు ఊహించలేదని వాపోయారు. ఇలాంటి కఠిన సమయంలో భారత ఒలింపిక్‌ సంఘంతో పాటు  ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుందని వినేశ్‌కు ధైర్యం చెప్పానన్నారు

వినేశ్‌ ఫొగట్‌ విషయంలో భారత రెజ్లింగ్‌ సమాఖ్య న్యాయం కోసం యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌కు అప్పీలు చేసిందని పీటీ ఉష  పేర్కొన్నారు. వినేశ్‌ విషయంలో తప్పక పోరాడతామని స్పష్టం చేశారు. వినేశ్‌ ఫొగట్‌ను నిర్ణీత బరువుకు తీసుకువచ్చేందుకు.. భారత వైద్య బృందం ఎంతగా శ్రమించిందో తనకు తెలుసనన్న ఉష.. రాత్రంతా ఆమె వర్కౌట్లు చేస్తూ గడిపిందని పేర్కొన్నారు. 

పోటీకి తనను తాను సన్నద్ధం చేసుకునేందుకు వినేశ్‌ ఎంతో కఠిన శ్రమకోర్చిందని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా ఒలింపిక్‌ విలేజ్‌కు వెళ్లి వినేశ్‌ ఫొగట్‌ను కలిశానని.. దేశమంతా తన వెంటే ఉందని భరోసా ఇచ్చినట్లు పీటీ ఉష తెలిపారు.

వినేశ్‌ స్థానంలో ఫైనల్‌కు ఆమె
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో 50 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం స్వర్ణ పతక పోటీలో పాల్గొనాల్సి ఉండగా.. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు నిర్వాహకులు. 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్‌ పతక ఆశలు ఆవిరైపోయాయి. 

ఈ నేపథ్యంలో సెమీస్‌లో వినేశ్‌ ఫొగట్‌ చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్‌ యుస్నెలిస్‌ గుజ్మాన్‌ లోపెజ్‌ ఫైనల్‌కు అర్హత సాధించినట్లు ఒలింపిక్స్‌ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్‌ నిబంధనల్లోని ఆర్టికల్‌ 11 ప్రకారం.. వినేశ్‌ స్థానంలో లోపెజ్‌కు ఈ అవకాశం దక్కినట్లు తెలిపారు. ఇక ప్రిక్వార్టర్స్‌ , క్వార్టర్స్‌లో వినేశ్‌ చేతిలో ఓడిన జపాన్‌ యూ సుసాకీ, ఉక్రెయిన్‌ ఒక్సానా లివాచ్‌ కాంస్య పతక పోరులో తలపడతారని పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement