భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతక వివాదం
పారిస్: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను డిస్‌క్వాలిఫై చేసిన అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తీర్పు మరో సారి వాయిదా పడింది. భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 13న తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి శుక్రవారమే దీనిపై వాదనలు ముగిశాయి. దాంతో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తీర్పు రానుందని సమాచారం రాగా అది జరగలేదు. అనంతరం ఆదివారం అదే సమయానికి రావచ్చని వినిపించినా... చివరకు మంగళవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. నిజానికి ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై స్పష్టత ఇస్తామని సీఏఎస్ పేర్కొంది.
అయితే వినేశ్ అంశాన్ని ‘ప్రత్యేక కేసు’గా చూస్తుండటంతో తీర్పు ఆలస్యమవుతూ వస్తోంది. కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను ఆదివారం సాయంత్రంలోగా తమకు అందించాలని సీఏఎస్ ఇరు పక్షాలను కోరింది. రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఉండటంతో వినేశ్‌ను నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. దాంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
తొలి రోజు ఫైనల్ చేరే వరకు నిబంధనలకు అనుగుణంగా తన బరువు పరిమితికి లోబడే ఉందని... కాబట్టి అప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటూ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆమె తరఫున సీఏఎస్‌లో వాదించారు. ఈ వ్యవహారంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఐఓఏ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment