అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఒక్కసారి కూడా మన ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈతరం చూడలేదు. ఆఖరిసారిగా 1980లో స్వర్ణం నెగ్గిందని సమాధానం గుర్తించడమే కానీ మన దేశం పతకం సాధించిన రోజు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇప్పుడు కొత్త తరం క్రీడాభిమానులు కూడా మేం భారత్ ఒలింపిక్ పతకం గెలవడాన్ని చూశామని ఘనంగా చెప్పుకోవచ్చు... జర్మనీని ఓడించి పోడియంపై మన స్టార్లు సగర్వంగా నిలబడిన సమయాన జాతీయ పతాకం ఎగురుతున్న దృశ్యం మా కళ్లల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని సంతోషాన్ని ప్రకటించవచ్చు! ఆ సమయంలో భావోద్వేగానికి గురికాని భారతీయుడు ఎవరు!
మైదానంలో ఆడి గెలిచిన మనోళ్లు సంబరాలు చేసుకున్నారు... హాకీతో సంబంధం లేని ఆటగాళ్లు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు... మాజీ హాకీ ఆటగాళ్లయితే తామే గెలిచినంతగా గంతులు వేస్తున్నారు...
ఒలింపిక్స్‌లో ఆడి పతక విజయంలో భాగం కాలేనివారు ఇప్పుడు గెలిచిన బృందంలో తమను తాను చూసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా సుదీర్ఘ కాలంగా భారత హాకీనే ప్రేమిస్తూ వచ్చిన వారి స్పందన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు... ఈ గెలుపును ఆస్వాదించాలంటే హాకీ అభిమానులే కానవసరం లేదు. భారతీయుడైతే చాలు! టోక్యోలో ఇతర పతకాలు కూడా మన ఖాతాలో చేరుతున్నాయి. కానీ హాకీ విజయాన్ని అందరూ కోరుకున్నారు, ప్రార్థించారు. ఎందుకంటే ఇది ఫలితానికి సంబంధించి మాత్రమే కాదు, ఆ ఆటతో ఎంతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. మరో ఈవెంట్‌లో ఓడినా, గెలిచినా హాకీ జట్టు మాత్రం పతకం సాధించాలని కోరుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు.
1984, 1988, ...., 2012, 2016... కాలక్రమంలో తొమ్మిది సార్లు ఒలింపిక్స్ వచ్చి వెళ్లాయి... పతకం మాత్రం రాలేదు. ఒకసారి అయితే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం కూడా దక్కలేదు. బంగారు హాకీ ఘనతలు ముగిసిన తర్వాత మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. ఈ సారైనా గెలవకపోతారా, ఒక్కసారైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తూ రావడం... ఆ ఆశలు కుప్పకూలడం రొటీన్‌గా మారిపోయాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించే ఆటలు అంటూ అంచనాలు పెంచే జాబితాలోంచి హాకీ పేరు ఎప్పుడో తీసేశారు. కానీ గెలిస్తే బాగుండేదన్న చిరు కోరిక మాత్రం అభిమానుల మనసులో ఏమూలనో ఉండేది. అందుకే ఈ మూడో స్థానమూ మురిపిస్తోంది. పసిడి రాకపోతేనేమి, పునరుజ్జీవం పొందుతున్న ఆటకు ఈ విజయం బంగారంకంటే గొప్ప. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీకి దక్కిన ఈ కాంస్య పతకం విలువ అమూల్యం.
టోక్యో: కోట్లాది అభిమానులకు ఆనందం పంచుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. ఒకదశలో 1–3తో వెనుకబడినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మన టీమ్ చివరకు విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జిత్ సింగ్ (17వ, 34వ నిమిషాల్లో), హార్దిక్ సింగ్ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషంలో), రూపిందర్‌పాల్ సింగ్ (31వ నిమిషంలో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిమర్ ఒరుజ్ (2వ నిమిషంలో), నిక్లాస్ వెలెన్ (24వ నిమిషంలో), బెనెడిక్ట్ ఫర్క్ (25వ నిమిషంలో), ల్యూకాస్ విండ్‌ఫెడర్ (48వ నిమిషంలో) జర్మనీ జట్టుకు గోల్స్ చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది.
వెనుకంజ వేసి...
కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో మ్యాచ్ బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ రెండో నిమిషంలోనే గోల్‌తో ముం దంజ వేసింది. భారత నెమ్మదైన డిఫెన్స్‌ను ఛేదించిన ఒరుజ్ రివర్స్ హిట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. మరో మూడు నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ లభించినా అది వృథా అయింది. వరుసగా గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ జర్మనీ తొలి క్వార్టర్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్స్‌లో భారత జట్టు కుదురుకుంది. మిడ్ ఫీల్డ్ నుంచి నీలకంఠ శర్మ ఇచ్చిన పాస్‌ను సర్కిల్‌లో అందుకున్న సిమ్రన్ జర్మనీ కీపర్‌ను తప్పించి రివర్స్ హిట్ కొట్టడంతో స్కోరు సమమైంది. ఈ జోరులో భారత్ అటాక్‌కు ప్రయత్నించినా, జర్మనీ వెంటనే కోలుకుంది. నీలకంఠ, సురేంద్ర కుమార్‌లు చేసిన పొరపాట్లతో బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న జర్మనీ వరుస నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టింది. దాంతో ఆ జట్టు ఆధిక్యం 3–1కి పెరిగింది.
మళ్లీ దూసుకెళ్లి...
గతంలోనైతే ఇలాంటి స్థితి నుంచి భారత్ ఇక ముందుకు వెళ్లడం కష్టంగా మారిపోయేదేమో. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా, ఆశలు కోల్పోకుండా భారత్ పట్టుదలగా ఆడటం సత్ఫలితాన్ని ఇచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ కీపర్ స్టాడ్లర్ సమర్థంగా అడ్డుకున్నా, రీబౌండ్‌లో హార్దిక్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ రాగా, ఈసారి హర్మన్‌ప్రీత్ విఫలం కాలేదు. స్కోరు 3–3కు చేరడంతో భారత్ జట్టులో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో క్వార్టర్ మొదటి నిమిషంలోనే భారత్‌కు కలిసొచ్చింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ను జర్మనీ ఆటగాళ్లు సర్కిల్ లోపల మొరటుగా అడ్డుకోవడంతో ‘పెనాల్టీ స్ట్రోక్’ లభించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపిందర్ దీనిని గోల్ చేయడంతో ఆధిక్యం 4–3కు పెరిగింది.
మరో మూడు నిమిషాలకే గుర్జంత్ ఇచ్చిన పాస్‌ను అందుకొని దూసుకుపోయిన సిమ్రన్‌జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 5–3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన భారత్‌కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే అవి గోల్‌గా మారలేదు. చివరి క్వార్టర్‌లో జర్మనీ మళ్లీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో పెనాల్టీ అవకాశం దక్కించుకున్న జర్మనీ దానిని ఉపయోగించుకోవడంతో భారత్ ఆధిక్యం 5–4కు తగ్గింది. మ్యాచ్ ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ గోల్ కీపర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి ఫీల్డ్‌లోకి తీసుకొచ్చి దాడులకు దిగింది. అయితే వీటిని మన గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. తమకు దక్కిన 13 పెనాల్టీ కార్నర్‌లలో జర్మనీ ఒకదానిని మాత్రమే గోల్‌గా మలచగా... భారత్ 6 పెనాల్టీలలో రెండింటిని గోల్స్‌గా మార్చుకోగలిగింది.
6.8 సెకన్ల ముందు...
అద్భుతంగా ఆడటం... ఇక మనం గెలిచేశాం అనుకుంటుండగా చివరి క్షణాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించి మ్యాచ్‌లు చేజార్చుకున్న దృశ్యం భారత హాకీ చరిత్రలో లెక్కలేనన్ని సార్లు జరిగింది. మన ఉదాసీతనకు తోడు అనూహ్యంగా వచ్చే అటాక్‌ను అంచనా వేసే లోపే ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మ్యాచ్ ముగియడానికి మరో 6.8 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో కూడా జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని జర్మనీ గోల్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే డిఫెన్స్‌లో ముందుగా దూసుకొచ్చి న అమిత్ రోహిదాస్, కీపర్ శ్రీజేశ్ కలిసి ఆపగలిగారు. అంతే... భారత ఆటగాళ్లు పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించగా, జర్మనీ ప్లేయర్లు కుప్పకూలిపోయారు.
టిక్..టిక్.. టైమర్ ఆగిపోయింది!
మ్యాచ్ మరో 29 సెకన్లలో ముగుస్తుందనగా మైదానంలో ఉన్న అఫీషియల్ టైమర్ పని చేయడం ఆగిపోయింది. కానీ ఆట మాత్రం సాగిపోయింది. చివరకు 11 సెకన్ల తర్వాత అది మళ్లీ పని చేసింది. సాంకేతిక సమస్యలతో టైమర్ పని చేయలేదు. జర్మనీకి 6 సెకన్ల ముందు పెనాల్టీ లభించిందంటే ఒక రకంగా అది అదనపు సమయంలో భారత్‌కు జరిగిన నష్టమే! మ్యాచ్ ముగిశాక కూడా నిర్వాహకులు దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సమస్య రాలేదు కానీ అదే చివరి పెనాల్టీ గోల్‌గా మారి ఉంటే..!
Comments
Please login to add a commentAdd a comment