మా కష్టానికి ఫలితం దక్కింది
భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్య
స్వదేశానికి చేరుకున్న జట్టు సభ్యులు
రూ. 2 కోట్ల 40 లక్షల చెక్ అందజేసిన కేంద్ర క్రీడల మంత్రి
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌తో పాటు కొందరు ప్లేయర్లు పారిస్‌లోనే ఉండిపోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ సహా పలువురు క్రీడాకారులు శనివారం స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హాకీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.
‘యావత్ దేశం మా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భావన అద్భుతంగా ఉంది. ఒలింపిక్స్ సమయంలో మాకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలు మా బాధ్యతను మరింత పెంచాయి’అని భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మిడ్‌ఫీల్డర్ అమిత్ రోహిదాస్ ‘రెడ్ కార్డ్’కు గురై మైదానాన్ని వీడాల్సి రాగా.. మిగిలిన 10 మందితోనే పోరాడిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో సెమీస్ చేరింది.
దీనిపై వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది జట్టులోని సభ్యులందరి పరస్పర నమ్మకానికి సంబంధించిన విషయంలో ఒక ప్లేయర్ లేకున్నా మ్యాచ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గోల్ పోస్ట్ ముందు పీఆర్ శ్రీజేశ్ అయితే లెక్కకు మిక్కిలిసార్లు మమ్మల్ని కాపాడాడు’అని వివరించాడు.
ప్రేరణ పెంచిన విజయం: మాండవీయా
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు కేంద్ర మంత్రి రూ. 2 కోట్ల 40 లక్షల చెక్‌ను అందజేశారు.
‘దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. మీ విజయం లక్షలాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. మీ ఘనతలు చూసి యావత్ దేశం గర్విస్తోంది. ఈ విజయం మీ పట్టుదల, సమష్టి కృషి, తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం’ అని మాండవీయా అన్నారు.
మంచుకొండల్లో శిక్షణ ఫలితాన్నిచ్చింది
పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగడానికి ముందు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో మూడు రోజుల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొనడం తమకెంతో ఉపయోగపడిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. మంచుకొండల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ జట్టు సభ్యుల్లో అనుబంధాన్ని పెంచేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
ఇక 2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా సçహాయక బృందంలో కీలక సభ్యుడైన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రాక కూడా తమకు కలిసొచ్చిందని హర్మన్ అన్నాడు. ‘ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద ఫలితాలు తెచ్చాయి.
పారిస్ క్రీడల్లో మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు మేమంతా ఒక జట్టుగా ముందుకు సాగాం. ఇందులో ప్యాడీ ఆప్టన్ పాత్ర కీలకం. అతడి వల్లే స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లాం. దాని వల్ల ఆటగాళ్లలో పట్టుదల, పరస్పర విశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment