కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
57 కేజీల విభాగంలో మూడో స్థానం
ప్లే ఆఫ్ బౌట్‌లో ప్యూర్టోరికో రెజ్లర్‌పై 13–5తో విజయం
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.
పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు.
అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.
7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment