స్ఫూర్తిదాయకం అమన్ ప్రస్థానం
‘గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్లు’... ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ‘ఛత్రశాల్’లో అమన్ సెహ్రావత్ గదిలో అతని మంచం పక్కన చేతి రాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది.
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు ‘క్వాలిఫైడ్ అథ్లెట్’ అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ ఐదు రింగులతో పాటు పతకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు అసలు ఒలింపిక్ పతకమే వేలాడనుంది!
ఈ మెగా ఈవెంట్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీలు కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఛత్రశాల్ సెంటర్‌లో యువ రెజ్లర్లకు స్ఫూర్తినివ్వడం కోసం దేశానికి కీర్తిని తెచ్చిన రెజ్లర్ల ఫొటోలను పెట్టారు.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్, రవి దహియాలతో పాటు వరల్డ్ చాంపియన్ షిప్‌లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన అమిత్ దహియా ఫోటో కూడా ఉంటుంది. ప్రతీ రోజూ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచే నడిచే అమన్ తన గురించి కూడా కలకన్నాడు. అతను ఢిల్లీ చేరేసరికి అతని ఫొటో కూడా సిద్ధమైపోతుందేమో!
తల్లిదండ్రులను కోల్పోయి...
హరియాణాలోని బిరోహర్‌కు చెందిన అమన్ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసిన అతను ఎప్పటికైనా ఢిల్లీలో ఛత్ర్‌శాల్ స్టేడియానికి వెళ్లి గొప్ప రెజ్లర్‌ను అవుతానంటూ నాన్నకు చెప్పేవాడు.
దురదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోగా అతని తల్లిదండ్రులు అనూహ్యంగా మరణించారు. దాంతో కొందరు సన్నిహితులు 11 ఏళ్ల వయసులో ఛత్రశాల్ స్టేడియంకు తీసుకొచ్చి చేర్పించారు. అప్పటి నుంచి అతనికి ఆ కేంద్రమే సొంత ఇల్లుగా, అతని లోకమంతా రెజ్లింగ్‌మయంగా మారిపోయింది. ప్రాక్టీస్ తప్ప మరో పని లేకుండా అమన్ గడిపేవాడు. కోచ్ లలిత్ కుమార్ అతడిని తీర్చిదిద్దాడు.
అండర్–23 ప్రపంచ విజేతగా...
18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచిన అనంతరం అమన్ జూనియర్ స్థాయిలో పలు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. ఆసియా క్యాడెట్స్, వరల్డ్ క్యాడెట్స్, ఆసియా అండర్–20, ఆసియా అండర్–23 చాంపియన్íÙప్‌లలో అతను సాధించిన విజయాలు అమన్‌కు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే 19 ఏళ్ల వయసులో అండర్–23 వరల్డ్ చాంపియన్íÙప్‌లో స్వర్ణం సాధించడంతో అతనిపై అందరి దృష్టి పడింది.
భవిష్యత్తులో అద్భుతాలు చేయగల ఆటగాడిగా అందరూ అంచనాకు వచ్చారు. వేర్వేరు గ్రాండ్‌ప్రిలు, ఇన్విటేషన్ టోర్నీలలో కూడా వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ స్థాయిలో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అమన్ ఎక్కడా తగ్గకుండా తన ఆటలో మరింత పదును పెంచుకున్నాడు. ఫలితంగా 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం అతని ఖాతాలో చేరాయి.
సుశీల్ ఫోన్ కాల్‌తో...
ఆసియా క్రీడల సెమీఫైనల్లో, ఆ తర్వాత ఆసియా క్వాలిఫయిర్స్‌లో బలహీన డిఫెన్స్‌తో అమన్ పరాజయంపాలై కాస్త నిరాశ చెందాడు. ఆ సమయంలో అతనికి తీహార్ జైలు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి0ది. అది చిరపరిచితమైన గొంతే. తన కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించి నువ్వు గొప్పవాడిని అవుతావని ఆశీర్వదించిన సుశీల్ కుమార్ చేసిన ఫోన్ అది.
‘నీ ఆటకు డిఫెన్స్ పనికిరాదు. అలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు. ఒక్క సెకను కూడా డిఫెన్స్‌పై దృష్టి పెట్టకుండా ఆరంభం నుంచి అటాక్ చేస్తేనే నీకు సరిపోతుంది. సీనియర్ స్థాయిలో డిఫెన్స్ టెక్నిక్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు. నేను కూడా అలాగే చేశాను’ అంటూ సుశీల్ చెప్పడం అమన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత అతని ఆటలో దూకుడు మరింత పెరిగింది.
గురువునే ఓడించి...
పారిస్ ఒలింపిక్స్ అవకాశం అమన్‌కు అంత సులువుగా రాలేదు. ఛత్ర్‌శాల్‌లో తాను ఎంతో అభిమానించే రెజ్లర్ రవి దహియా. అతడిపై ఇష్టం కారణంగా అన్ని చోట్లా అతడినే అనుకరిస్తూ అతని శిష్యుడిగా తనను తాను భావించుకునేవాడు. కానీ గురువుతోనే పోటీ పడాల్సిన స్థితి వస్తే! అమన్‌కు అదే అనుభవం ఎదురైంది.
రవి దహియా కేటగిరీ అయిన 57 కేజీల విభాగంలోనే తానూ పోటీ పడుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఒకరికే అవకాశం ఉంది. కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్‌లో రవి చేతిలో 0–10తో అమన్ చిత్తుగా ఓడాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది తాను గురుభావంతో చూస్తే పని కాదని, ఒక ప్రత్యర్థి గా మాత్రమే చూడాలని.
2024 ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో చెలరేగి రవిని ఓడించడంలో సఫలమైన అమన్... గురువు స్థానంలోకి వచ్చి కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత క్వాలిఫయర్స్‌లోనూ చెలరేగి ఒలింపిక్ బెర్త్‌ను సాధించాడు. ఈ క్రమంలో వాంగెలోవ్, ఆండ్రీ యెట్‌సెంకో, చోంగ్ సాంగ్‌వంటి సీనియర్లను అతను ఓడించగలిగాడు.
ఘనమైన రికార్డుతో...
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత ప్రపంచ రెజ్లింగ్‌కు రాజధాని లాంటి ‘డేగిస్తాన్’లో అతను సన్నద్ధమయ్యాడు. ఛత్రశాల్‌లో మినహా అతని కెరీర్‌లో శిక్షణ తీసుకున్న మరో చోటు డేగిస్తాన్ (రష్యాకు సమీపంలో) మాత్రమే. అత్యుత్తమ సౌకర్యాలతో పాటు పలువురు చాంపియన్ ప్లేయర్ల మధ్య సాధన చేయడం, పదునైన స్పేరింగ్ పార్ట్‌నర్‌లు ఉండటంతో అమన్ ప్రాక్టీస్ జోరుగా సాగింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అమన్ ఆగలేదు.
ఫిబ్రవరి 2022లో సీనియర్ స్థాయిలో తొలిసారి అంతర్జాతీయ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అమన్ అప్పటి నుంచి ఈ ఒలింపిక్స్‌కు ముందు వరకు 39 బౌట్‌లలో పాల్గొంటే 31 విజయాలు సాధించాడు. అంటే 79.4 విజయశాతం. ఇదే అతనిపై ఒలింపిక్ పతకం అంచనాలను పెంచింది. ఇప్పుడు తనకంటే ముందు ఒలింపిక్ పతకాలు సాధించిన తనలో స్ఫూర్తిని నింపిన దిగ్గజాల సరసన అతను సగర్వంగా నిలబడ్డాడు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment