పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన మన పోరు
భారత్ ఖాతాలో ఆరు పతకాలు
క్వార్టర్ ఫైనల్లో ఓడిన రెజ్లర్ రీతిక
నేటితో పారిస్ క్రీడలకు తెర
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. శనివారం రెజ్లింగ్ ఈవెంట్‌తో భారత పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.
ఆమెను ఓడించిన కిర్గిస్తాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఫలితంగా రీతికకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కనీసం కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లేకుండా పోయింది. ‘పారిస్’లో భారత్‌కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి.
ప్రస్తుతం భారత్ 70వ స్థానంలో ఉంది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఫలితంగా చివరిరోజు పతకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచి 48వ స్థానంలో నిలిచింది.
పారిస్: విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. శనివారంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 76 కేజీల విభాగంలో రీతిక కాంస్య పతక పోరుకు అర్హత సాధించి ఉంటే ఆదివారం కూడా భారత్ పతకం రేసులో నిలిచేది. కానీ రీతిక పతకం రేసులో స్థానం సంపాదించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ రీతిక క్వార్టర్ ఫైనల్లో కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెదెత్ కిజీ చేతిలో ఓడిపోయింది. మూడు నిమిషాల నిడివి గల రెండు భాగాలు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు.
స్కోరు సమమైతే నిబంధనల ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ బౌట్‌లో ముందుగా రీతిక ఒక పాయింట్ సాధించింది. రెండో భాగంలో కిర్గిస్తాన్ రెజ్లర్ పాయింట్ స్కోరు చేసి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ పాయింట్ లభించలేదు. దాంతో చివరి పాయింట్ స్కోరు చేసిన కిర్గిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం కిర్గిస్తాన్ రెజ్లర్ సెమీఫైనల్లో 6–8 పాయింట్ల తేడాతో కెన్నీడీ అలెక్సిస్ బ్లేడ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
దాంతో ‘రెపిచాజ్’ రూపంలో రీతికకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం చేజారింది. అంతకుముందు తొలి రౌండ్‌లో రీతిక కేవలం 29 సెకన్లలో హంగేరి రెజ్లర్ బెర్నాడెట్ నగీపై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో గెలిచింది. ఇద్దరు రెజ్లర్ల మధ్య పాయింట్ల తేడా 10 పాయింట్లకు చేరుకున్న వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేస్తారు. బెర్నాడెట్‌తో జరిగిన బౌట్‌లో 29 సెకన్ల సమయానికి రీతిక 12–2తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి రీతికను విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment