ఒలింపిక్స్ చరిత్రలో ఘనమైన రికార్డు ఉన్న భారత హాకీ జట్టు ‘పారిస్’ క్రీడల్లోనూ దాన్ని కొనసాగించింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడి కాంస్యం పతకం సాధించడం ఆనందంగా ఉంది. సహచరుల నుంచి ఇంతకు మించిన వీడ్కోలు బహుమతి అడగలేను. రెండు దశాబ్దాలకు పైగా జట్టుతో ఉన్నా. ఇప్పుడిక యువతరానికి పాఠాలు చెబుతా. వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం ద్వారా యువ ఆటగాళ్లలో స్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తా.
ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగిందనుకుంటున్నా. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో యువ షూటర్ మనూ భాకర్‌తో కలిసి త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నా. మనూ నాకంటే 14 ఏళ్లు చిన్నది. అయినా ఆమె విశ్వక్రీడల్లో అద్భుతాలు చేసింది. ప్రతి అథ్లెట్ ఏకైక లక్ష్యం దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే. అది మనూలో సమృద్ధిగా ఉంది.
2012 లండన్ ఒలింపిక్స్‌తో నా విశ్వక్రీడల ప్రయాణం ప్రారంభమైంది. ఈ పుష్కర కాలంలో క్రీడలకు ప్రోత్సాహం ఎలా మారిందో నేను ప్రత్యక్షంగా చూశాను. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సరైన సౌకర్యాలు లేవని సాకులు చెప్పే అవకాశమే లేదు.
హాకీలో సాధించిన పతకం కోట్లాది మంది భారతీయుల సమష్టితత్వానికి నిదర్శనమని ప్రధాని అన్నప్పుడు... గర్వంతో నరాలు ఉప్పొంగాయి. పారిస్ క్రీడల్లో బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మా జట్టు కలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతం. దాదాపు 75 శాతం సమయం కేవలం 10 మందితోనే ఆడాం. ఆ పట్టుదలే ఇక్కడి వరకు చేర్చింది. మన జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇప్పుడే వాళ్ల ప్రయాణాన్ని ప్రారంభించగా... మిగిలిన 11 మంది టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నారు.
ప్రపంచంలోనే మేటి జట్లతో పోటీపడేందుకు బెంగళూరులోనూ ‘సాయ్’ శిక్షణ కేంద్రం మాకు అన్ని విధాలుగా సçహాయపడింది. గత పదిహేనేళ్లుగా ఈ కేంద్రమే నా ఇల్లు. కుటుంబ సభ్యులతో కన్నా అక్కడే ఎక్కువ గడిపా. అంతర్జాతీయ స్థాయి జిమ్, పారిస్‌లో మాదిరి సరికొత్త టర్ఫ్ ఇలా... ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది.
ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా మరవలేనిది. కోచ్ క్రెయిగ్ ఫల్టన్ జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఆటగాళ్లందరికి ఒక్క తాటిపై నడిపించారు. ‘ఖేలో ఇండియా’ వ్యవస్థ భవిష్యత్తును మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నా.
-పీఆర్ శ్రీజేశ్
Comments
Please login to add a commentAdd a comment