టోక్యో: మనమంటే ఐపీఎల్ వినోదంలో మునిగాం.... ఇప్పుడేమో ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌పైనే చర్చ జరుగుతోంది. జపాన్ ప్రభుత్వం కచ్చితంగా నిర్వహించి తీరుతామని ప్రకటించినప్పటికీ ఏ మూలనో సందిగ్ధం మాత్రం వీడటం లేదు. పైగా నెలల వ్యవధిలోనే విశ్వ క్రీడల నిర్వహణపై జపాన్ వాసుల వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో 48 శాతం ఒలింపిక్స్ వద్దంటే ఇప్పుడేమో 63 శాతం మంది వద్దే వద్దంటున్నారు. కేవలం 27 శాతమే సుముఖంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తలెత్తే ప్రశ్నలపై సమాధానాలివి... (అదే టీమిండియా కొంపముంచింది..)
అనుకున్నదొక్కటి...అయ్యిందొక్కటి?
ఒలింపిక్స్ బడ్జెట్ అమాంతం పెరగడంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సెప్టెంబర్‌లో అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ప్రశ్నలకు ఈ వర్సిటీ బృందం బదులిచ్చి, సహేతుక వివరణ కూడా ఇచ్చింది. ఇందులో ఒకటి మాత్రం సూటిగా చెప్పింది... 1960 నుంచి జరుగుతున్న ప్రతీ ఒక్క ఒలింపిక్స్ కూడా అంచనాలను మించే బడ్జెట్ (ఓవర్ బడ్జెట్)తోనే జరిగింది. బడ్జెట్ పెరగడం అనేది కొత్తేం కాదని స్పష్టం చేసింది. అయితే నిర్మాణాలకు పెట్టిన తుది గడువు చాలా తక్కువ. ఆలోపే పూర్తి చేయాలంటే పని సామర్థ్యం పెంచుకోవాలి. అందుకే వ్యయం నియంత్రణ కోల్పోయింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీది (ఐఓసీ) ప్రేక్షకపాత్రే. నిర్వాహక దేశమే అన్ని చూసుకోవాలి. చేసుకుంటూ పోవాలి. 2013లో ఆతిథ్య హక్కువలు పొందినపుడు ఒలింపిక్స్ అంచనా వ్యయం 730 కోట్ల డాలర్లు. కానీ ఇప్పుడైతే రెండు రెట్లు (2500 కోట్ల డాలర్లు) అమాంతం పెరిగిపోయింది.
మరి ఐఓసీ చేసేదేంటి...
ఐఓసీ అనేది లాభాపేక్ష లేని ఆర్గనైజేషన్. ఇది స్విట్జర్లాండ్‌లో రిజిస్టరైన సంస్థ. ఈ సంస్థ వనరులు బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లే. తాజా ఐఓసీ నివేదిక ప్రకారం ఐఓసీ 73 శాతం ఆదాయాన్ని బ్రాడ్‌కాస్టింగ్ ద్వారానే పొందుతుంది. మరో 18 శాతం వివిధ స్పాన్సర్‌షిప్ హక్కుల ద్వారా పోగేసుకుంటుంది. గత నాలుగేళ్ల ఒలింపిక్ సైకిల్‌లో ఐఓసీ పొందిన ఆదాయం 57 లక్షల డాలర్లు. ఈ మొత్తంలో 90 శాతాన్ని ఒలింపిక్స్ ప్రమోషన్స్, నిర్వాహక దేశానికి కొంత నిధిగా అందజేస్తుంది.
జపాన్‌లో ప్రజాస్పందన...
కరోనా భయాందోళనల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జపాన్ వాసులు రద్దు లేదంటే మరో వాయిదా అని బలంగా కోరుతున్నారు. ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు జపనీస్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో 63 శాతం మంది వాయిదా లేదా రద్దు చేయాలంటున్నారు. కేవలం 27 శాతం మంది మాత్రమే ఆతిథ్యానికి ‘సై’ అంటున్నారు. గతంతో పోలిస్తే సుముఖంగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్టోబర్‌నాటి సర్వేలో 40 శాతం మంది టోక్యో ఒలింపిక్స్ జరగాలని అన్నారు. 48 శాతం వ్యతిరేకించారు. బహుశా కరోనా ‘సెకండ్ వేవ్’ భయాలే జపాన్ వాసుల్ని కలవరపెడుతున్నట్లున్నాయి.
టోక్యోలో కోవిడ్–19 ప్రభావం...
నిజానికి జపాన్‌లోనే కాదు ఆతిథ్య నగరం టోక్యోలోనూ కోవిడ్ ప్రభావం తక్కువ. గురువారం నాటి తాజా కేసుల్ని చూస్తే కేవలం 2,893 మందికి కొత్తగా వైరస్ సోకింది. అలాగే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ మృతులు 3,000 మందే. అంతర్జాతీయ లెక్కల ప్రకారం 12.60 కోట్ల పైచిలుకు జనాభా వున్న ఈ దేశంలో బాధితులు, మృతుల రేటు చాలా తక్కువ. 33 కోట్ల జనాభా ఉన్న అగ్రదేశం అమెరికాలో లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో ఏకంగా 3 లక్షల మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment