
ముంబై: జులై 13 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నిమిత్తం భారత బి జట్టు హెడ్ కోచ్‌గా నియమించబడిన భారత దిగ్గజ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. రోజుల వ్యవధిలో మాటమార్చాడు. తాను అండర్ 19 జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో జట్టుకు ఎంపికైన ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించానని, రాబోయే శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల(మూడు వన్డేలు, మూడు టీ20లు) లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు.
తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ పరిధిలోని విషయమని, తమకు కావాల్సిన జట్టును వారు ఎంపిక చేసుకుంటారని ఆయన వివరించాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని, అయితే వారు సిరీస్ గెలవడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ బెర్తు కోసం అందరూ పోటీపడవచ్చంటూనే, అవకాశం వచ్చిన వాళ్లు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. కాగా, శ్రీలంక పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.
చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను..