
ముంబై: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 15ను చివరి తేదీగా ప్రకటించింది. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే.
ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ధవన్ సేనకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ పరిమిత ఓవర్ల పర్యటనలో ద్రవిడ్ ప్రభావం నామమాత్రమే అయినా.. అతన్ని భవిష్యత్తు టీమిండియా హెడ్ కోచ్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. రవిశాస్త్రి పదవీకాలాన్ని బీసీసీఐ పొడించడం దాదాపు అసాధ్యమే.
ఈ నేపథ్యంలో ఎన్సీఏగా డైరెక్టర్‌గా, భారత్-ఏ, అండర్-23, అండర్-19, అండర్-16 జట్ల కోచ్‌గా పని చేసిన అనుభవమున్న ద్రవిడ్ వైపు బోర్డు మొగ్గు చూపే అవకాశం ఉంది. ది వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకోవడం, ఇండియా రిజర్వ్ బెంచ్‌ను బలంగా తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించడం ద్రవిడ్‌కు కలిసొచ్చే అంశాలు. అందులోనూ ద్రవిడ్ సహచరుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు స్పష్టమవుతోంది.