పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : క్రికెట్‌లో 24 గంటల వ్యవధిలో రెండు అరుదైన ఘనతలు నమోదయ్యాయి. మంగళవారం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ 600 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందగా.... బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం సెయింట్ లూసియా జూక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈ ఘనత అందుకున్నాడు.
రఖీమ్ కార్న్‌వాల్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రావో టి20 క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అనంతరం రోస్టన్ చేజ్‌ను కూడా అవుట్ చేసి బ్రావో తన వికెట్ల సంఖ్యను 501కు పెంచుకున్నాడు. సెయింట్ లూసియా జూక్స్ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టాక ట్రిన్‌బాగో జట్టు లక్ష్యాన్ని 9 ఓవర్లలో 72 పరుగులుగా నిర్ణయించారు. ట్రిన్‌బాగో 8 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో నెగ్గి ఈ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది.
2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో గత 14 ఏళ్లలో అంతర్జాతీయ, ప్రొఫెషనల్ లీగ్స్‌తో కలిపి 459 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 501 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ 390 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న పలు టి20 లీగ్స్‌లో ప్రముఖ జట్లకు ఆడిన బ్రావో... చాంపియన్స్ లీగ్ (2009–10; ట్రినిడాడ్ అండ్ టొబాగో 12 వికెట్లు), ఐపీఎల్ (చెన్నై సూపర్ కింగ్స్–2013లో 32 వికెట్లు; 2015లో 26 వికెట్లు), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో–2015లో 28 వికెట్లు; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్–2016లో 21 వికెట్లు), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్–2016–2017; 21 వికెట్లు), బిగ్‌బాష్ లీగ్ (మెల్‌బోర్న్ రెనెగెడ్స్–2017–2018; 18 వికెట్లు)లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment