అలుపెరగని ఆల్‌రౌండర్‌ | Dwayne Bravo Creates History | Sakshi
Sakshi News home page

అలుపెరగని ఆల్‌రౌండర్‌

Published Fri, Aug 28 2020 4:23 PM | Last Updated on Fri, Aug 28 2020 4:37 PM

Dwayne Bravo Creates History - Sakshi

ఐపీఎల్‌ టీమ్‌లంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే). ఈ జట్టు అనగానే మదిలో మెదిలే తొలి పేరు ధోని. మరి ధోని, రైనాలతోపాటు మరో స్టార్‌ కూడా సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతనే వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో. చెన్నై మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌షిప్‌ సాధించడంలో ధోని సారథ్యం ఎంత ఉందో... బ్రావో సత్తా కూడా అంతే ఉంది. పొట్టి క్రికెట్‌లో గట్టి ఆల్‌రౌండర్‌ ఈ కరీబియన్‌ సూపర్‌స్టార్‌. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) టోర్నీలో భాగంగా బుధవారం సెయింట్‌ లూసియా జూక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 500 వికెట్ల మైలురాయి దాటి టి20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 
–సాక్షి క్రీడా విభాగం  

ట్రినిడాడ్‌లోని కరీబియన్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా అడుగు జాడల నుంచే బ్రావో వచ్చాడు. కానీ లారా మాదిరిగా క్లాస్‌ బ్యాటింగ్‌ లేదు. తన ట్రేడ్‌మార్క్‌ షాట్‌ కవర్‌డ్రైవ్‌ను ఏమంత బాగా ఆడలేడు. చెప్పాలంటే పర్‌ఫెక్ట్‌ షాట్లేవీ తనకంటూ లేకపోయినా బ్రావో మాత్రం బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. మ్యాచ్‌లను  బ్యాట్‌తో ముగించగలడు. బంతి (పేస్‌ బౌలింగ్‌)తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కూల్చేయగలడు. ఇక టి20 లీగ్‌లకైతే స్పెషలిస్ట్‌గా మారాడు... కాదు కాదు ఎదిగాడు. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. అందుకే ఎవరికీ సాధ్యంకాని 500 వికెట్లను తన పేస్‌ బౌలింగ్‌తో సుసాధ్యం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ బ్రావో మెరిపించగలడు. ఓవరాల్‌గా 459 టి20 మ్యాచ్‌లు ఆడిన బ్రావో ఇప్పటివరకు 501 వికెట్లు తీయడంతోపాటు 6,313 పరుగులు చేసి, 225 క్యాచ్‌లు కూడా పట్టాడు.  (చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ )

పొట్టి ఫార్మాట్‌ మేటి బౌలర్‌... 
సంప్రదాయ క్రికెట్‌ను వన్డే ఆట మించితే... ఈ 50 ఓవర్లను దంచేసే ఆట 20–20. ఇందులో బాదడాని కే బాట ఉంటుంది. బ్యాట్స్‌ మెన్‌దే ఆట. బ్యాటింగ్‌ మెరుపులతోనే టి20 వెలుగు వెలుగుతోంది. ఇలాంటి ఫార్మాట్‌లో ప్రత్యేకించి బౌలరే బలిపశువయ్యే పోటీల్లో 500 వికెట్లు తీయడం ఆషామాషీ కానే కాదు. ఎందుకంటే టెస్టులో వేసినట్లు అపరిమిత ఓవర్లు వేయలేం. వన్డేల్లా 10 ఓవర్ల కోటా ఉండదు. ఏమున్నా... ఆ నాలుగు ఓవర్లతోనే సాధించాలి. లేదంటే బ్యాట్స్‌మన్‌ బాదుడుకు మోకరిల్లాలి! బ్యాటింగ్‌ విశ్వరూపం కనిపించే టి20ల్లో బ్రావోది కచ్చితంగా అనితర సాధ్యమైన ప్రదర్శనే! 

ఇది అతని శైలి... 
క్రీజులో పాతుకుపోయిన ఉద్ధండుల్ని, డివిలియర్స్‌ లాంటి ‘360 డిగ్రీ బ్యాట్స్‌మన్‌’ను తన వైవిధ్యమైన బంతులతో బోల్తా కొట్టించే ప్రత్యేకత బ్రావోది. భారత్‌లో జరిగిన 2016 టి20 ప్రపంచకప్‌లో సఫారీ స్టార్‌ డివిలియర్స్‌ను అంతుచిక్కని బంతితో ఆట ముగించాడు. లంక బౌలర్‌ మలింగ వేగం, తనకు మాత్రమే సాధ్యమయ్యే ‘స్లోయర్‌ ఆఫ్‌ కట్టర్‌’, ‘స్లోయర్‌ బౌన్సర్‌’లు బ్రావో అస్త్రాలు. అందుకేనేమో బ్యాట్స్‌మెన్‌ దంచేసి ఆటలో మించిపోయిన బౌలర్‌ బ్రావో ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు.  

విండీస్‌ సూపర్‌ స్టార్‌ లారా కెప్టెన్సీలో 16 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయమైన బ్రావో అలుపెరగని బాటసారిగా ఆడుతూనే ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కిన బ్రావోకు దరిదాపుల్లో ఏ ఒక్కరూ లేదు. ఈ వరుసలో రెండో స్థానంలో ఉన్న లంక బౌలర్‌ మలింగ (390) కనీసం 400 మార్క్‌ను దాటలేదు. 

లీగ్‌ ఏదైనా టాపర్‌ ఒకడే! 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), చాంపియన్స్‌ లీగ్, కరీబియన్, బంగ్లాదేశ్, బిగ్‌బాష్‌ ఇలా లీగ్‌ ఏదైనా బ్రావో ఆడితే అతనే బౌలింగ్‌ టాపర్‌. 2009లో ట్రినిడాడ్‌ తరఫున చాంపియన్స్‌ లీగ్‌ ఆడిన బ్రావో 12 వికెట్లతో టాప్‌ లేపాడు. ఐపీఎల్‌లో అయితే రెండుసార్లు (2013, 15) సీఎస్‌కే తురుఫుముక్కగా రాణించాడు. ఆ రెండు సీజన్లలో అతను 32, 26 వికెట్లు పడేశాడు. సొంతగడ్డపై జరిగే కరీబియన్‌ లీగ్‌ల్లో 2015, 2016లలో వరుసగా 28, 21 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (2016)లో 21 వికెట్లు, బిగ్‌బాష్‌ (2017) లీగ్‌లో 18 వికెట్లు తీసి టాప్‌ బౌలర్‌గా నిలిచాడు.   (చదవండి:ఊహించని ట్విస్ట్‌.. పాపం కెవిన్‌ ఒబ్రెయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement