21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్‌ | ENG Vs WI 1st Test: Jimmy Anderson Says Goodbye To Test Cricket After 21 Years Of Long Dominance | Sakshi
Sakshi News home page

Jimmy Anderson Retirement: 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్‌

Published Fri, Jul 12 2024 6:24 PM | Last Updated on Fri, Jul 12 2024 6:56 PM

ENG VS WI 1st Test: Jimmy Anderson Says Goodbye To Test Cricket After 21 Years Of Long Dominance

దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జిమ్మీ ఆండర్సన్‌ 21 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆండర్సన్‌ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఆండర్సన్‌.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్‌ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్‌కు సాగనంపారు. లార్డ్స్‌ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్‌ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఆండర్సన్‌ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్‌ చివరి వికెట్‌ జాషువ డసిల్వ.

41 ఏళ్ల ఆండర్సన్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 188 మ్యాచ్‌లు ఆడి 26.45 సగటున 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్‌ కెరీర్‌ ప్రారంభించిన ఆండర్సన్‌ ఆంతకుముందు ఏడాదే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో జిమ్మీ​ 194 మ్యాచ్‌లు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్‌ ఇంగ్లండ్‌ తరఫున టీ20లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో కేవలం 19 మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 18 వికెట్లు పడగొట్టాడు. 

సుదీర్ఘ కెరీర్‌  లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌గా కీర్తించబడతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. మురళీథరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) మాత్రమే ఆండర్సన్‌ కంటే ఎక్కువ టెస్ట్‌ వికెట్లు పడగొట్టారు. మూడు ఫార్మాట్లలో చూసినా మురళీథరన్‌ (1347), షేన్‌ వార్నే (1001) మాత్రమే ఆండర్సన్‌ (987) కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. దిగ్గజ బౌలర్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అరంగేట్రం పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్‌ ధాటికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ అట్కిన్సన్‌ (7/45), ఆండర్సన్‌ (1/26), క్రిస్‌ వోక్స్‌ (1/29), స్టోక్స్‌ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మికైల్‌ లూయిస్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేశారు. జాక్‌ క్రాలే 76, ఓలీ పోప్‌ 57, జో రూట్‌ 68, హ్యారీ బ్రూక్‌ 50, జేమీ స్మిత్‌ 70 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌ 4, గుడకేశ్‌ మోటీ, జేసన్‌ హోల్డర్‌ తలో 2, అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

250 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ను అట్కిన్సన్‌ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించడంతో విండీస్‌ 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌తో పాటు ఆండర్సన్‌ (3/32), స్టోక్స్‌ (2/25) రాణించారు. విండీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మోటీ (31 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement