బజ్‌బాల్ విధానాన్ని అవలంభించి ఇంగ్లండ్ జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై ఆడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టును 267 పరుగుల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించారు.
ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ 7 వికెట్లతో విజృంభించగా.. బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ వెటరన్ పేస్ ద్వయం రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగారు. బ్రాడ్ 4, ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాశించారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లు కావడం మరో ఆసక్తికర విషయం. ఇంగ్లండ్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆండర్సన్, బ్రాడ్ ధాటికి 126 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
అటాకింగ్ ఫార్ములాను అమలు చేసిన ఇంగ్లండ్ మరోసారి సక్సెస్ సాధించింది. ఆండర్సన్, బ్రాడ్‌తో పాటు ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా.. టామ్ లాథమ్ (15), బ్రేస్‌వెల్ (25) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులకు ఆలౌటైంది. 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 374 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటై 267 పరుగుల తేడతో ఓటమిపాలైంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ బ్లండెల్ (138) సెంచరీతో, కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశారు. అనంతరం ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.
ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బౌలర్లు వాగ్నర్ 6, టిక్నర్ 4, కుగ్గెలిన్ 4, బ్రేస్‌వెల్ 3, సౌథీ 2 పడగొట్టగా.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 7, బ్రాడ్ 5, రాబిన్సన్ 5, జాక్ లీచ్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment