
కోల్‌కతా: వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టుతో కోహ్లి బృందం ఒక డే నైట్ టెస్టు ఆడుతుందని... పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్ వేదికగా అహ్మదాబాద్‌ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోల్‌కతా ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో భారత్‌లో ఇంగ్లండ్ పర్యటించాల్సి ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో ఇంగ్లండ్... ఐదు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సిరీస్‌ను కూడా యూఏఈలోనే నిర్వహిస్తారనే వార్తలు వినిపించినా... అవన్నీ ఊహాగానాలని గంగూలీ కొట్టి పారేశాడు.
‘భారత్‌లోనే ఈ సిరీస్‌ను నిర్వహించేలా బీసీసీఐ కృషి చేస్తోంది. ‘బయో సెక్యూర్ బబుల్స్’ను నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. ఇందు కోసం అహ్మదాబాద్, కోల్‌కతా, ధర్మశాలలను పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’అని గంగూలీ వివరించాడు. ప్రస్తుతం తమ దృష్టంతా త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనపై ఉందని... అందుకోసం జట్టును ప్రకటించాల్సి ఉందన్నాడు. కరోనా వల్ల ఇప్పటికే ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ తాజా సీజన్‌ను జనవరి 1న ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై చర్చించి రంజీ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment