టెస్టు సిరీస్ తరహాలోనే టి20ల్లోనూ ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు వెంటనే కోలుకొని సత్తా చాటింది. రెండో పోరులో సునాయాస విజయం సాధించిన టీమిండియా ఇదే జోరును కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ అనుభవంతో ఇంగ్లండ్ మళ్లీ తమ బ్యాటింగ్‌కు పదును పెట్టే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మరోసారి టాప్–2 జట్ల మధ్య పొట్టి సమరం ఆసక్తికరంగా సాగనుంది.
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. రెండో మ్యాచ్‌లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన కోహ్లి సేన అన్ని రంగాల్లో రాణించి ప్రత్యర్థిని మళ్లీ పడగొట్టాలని భావిస్తోంది.
రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ!
గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా బెంచీ బలాన్ని చూపించింది. పైగా ఓపెనర్‌గా కిషన్ రూపంలో మన జట్టుకు మరో ప్రత్యామ్నాయం కూడా లభించింది. ఈ యువ ఆటగాడు మళ్లీ ఒక మెరుపు ప్రదర్శన ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. రెండు మ్యాచ్‌ల వరకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు సిరీస్ ఆరంభ సమయంలో కోహ్లి చెప్పాడు. అదే నిజమైతే ఈ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాలి. వరుసగా రెండు మ్యాచ్‌లలో 1, 0 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ స్థానంలో మాత్రమే రోహిత్ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే గత రెండేళ్లలో భారత్ తరఫున టి20ల్లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా ఉన్న రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వకుండా అప్పుడే పక్కన పెడతారా అనేది చూడాలి.
కోహ్లి తనదైన శైలిలో ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభపరిణామం. పంత్, అయ్యర్ కూడా చెలరేగితే జట్టు భారీ స్కోరు సాధించవచ్చు. అరంగేట్రం మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం దక్కని సూర్య కుమార్ యాదవ్‌కు ఆరో స్థానంలో ఈసారి ఎన్ని బంతులు లభిస్తాయో చూ డాలి. బౌలింగ్‌లో టీమిండియా మార్పులు చేయకపోవచ్చు. స్పిన్నర్లు చహల్, సుందర్ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. శార్దుల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకోగా, హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. పునరాగమనంలో భువనేశ్వర్ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు కాబట్టి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడం సులువు కాదు.
మొయిన్ అలీకి చాన్స్!
మంచి విజయం తర్వాత ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన ఆ జట్టు ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని నిలువరించలేక సునాయాసంగా తలవంచింది. మొత్తంగా చూస్తే దూకుడైన బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా కీలక సమయంలో జట్టు సమష్టిగా విఫలమైంది. జేసన్ రాయ్, బట్లర్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే మలాన్, బెయిర్‌స్టో ముందుకు తీసుకెళ్లగలరు. ఈసారి ఈ టాప్–4 ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి. ఒక్క కెప్టెన్ మోర్గాన్ మాత్రమే తడబాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడగలుగుతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ పేలవ ప్రదర్శన కూడా ఇంగ్లండ్‌కు ఇబ్బందిగా మారింది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్‌గా అనుభవజ్ఞుడు మొయిన్ అలీకి అవకాశం దక్కుతుంది. టామ్ కరన్‌ను పక్కన పెట్టనున్న మేనేజ్‌మెంట్... వుడ్ ఫిట్‌గా ఉంటే జోర్డాన్ ను తప్పించాలని యోచిస్తోంది.
ప్రేక్షకులు లేకుండానే...
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత మరోసారి పెరుగుతుండటంతో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి మూడు టి20 మ్యాచ్‌లను ప్రేక్షకలు లేకుండానే నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే.
పిచ్, వాతావరణం
ఎర్ర మట్టితో రూపొందించిన పిచ్‌పై ఈ మ్యాచ్ జరగనుంది. కాబట్టి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇరు జట్ల స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఛేదనలో సులువుగా కనిపిస్తుం డటంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. వర్ష సూచన లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్/రోహిత్, కిషన్, పంత్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, స్యామ్ కరన్, అలీ, ఆర్చర్, రషీద్, వుడ్/జోర్డాన్.
Comments
Please login to add a commentAdd a comment