క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ క్రికెట్ మహాసంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.
ఈ రెండు జట్లు కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లూక్కేద్దం. ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తున్నాయి.
ఇంగ్లండ్..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 2019 వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆ జట్టుకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే తొలి మ్యాచ్‌కు స్టోక్స్ అందుబాటుపై సందేహం నెలకొంది. స్టోక్స్ తుంటి గాయంతో బాధపడుతున్నాడు.
స్టోక్స్ తొలి మ్యాచ్‌కు దూరమైన బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, కెప్టెన్ జోస్ బట్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలిగే లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ వంటి వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌లు కూడా ఉన్నారు. వీరిందరూ తమ బ్యాట్‌కు పని చేబితే అహ్మదాబాద్‌లో పరుగుల వరద పారడం ఖాయం.
అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్ బలంగా కన్పిస్తోంది. మార్క్ వుడ్, టోప్లీ వంటి నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అదిల్ రషీద్ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. మరోవైపు వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్..
ప్రతీసారి ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్బుతాలు చేస్తుంది కివీస్ జట్టు. వరుసగా రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ టోర్నీ రన్నరప్‌లుగా నిలిచింది. 2019 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్ చేతిలోనే కివీస్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది టోర్నీలో తొలి మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని బ్లాక్ క్యాప్స్ భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
అయితే మొదటి మ్యాచ్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టు గట్టి ఎదురుదెబ్బ. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనున్నాడు. ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. రెండు సార్లు కూడా 300 పైగా పరుగులు నమోదు చేసింది.
బ్యాటింగ్‌లో డెవాన్ కాన్వే, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కూడా అదరగొడుతున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్‌లో కూడిన పేస్ త్రయం ఉంది.
వీరిముగ్గురూ బంతితో చెలరేగితే ఇంగ్లండే కాదు ప్రత్యర్ధి ఏ జట్టు అయినా తలవంచాల్సిందే. న్యూజిలాండ్ కూడా బంగ్లాదేశ్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసి భారత్ గడ్డపై అడుగుపెట్టింది. కాబట్టి మరోసారి ఇంగ్లండ్‌కు కివీస్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి పోరులో ఎవరూ ఎవరిపై పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.
హెడ్ టూ హెడ్ రికార్డులు..
ఇక ఇంగ్లండ్-కివీస్ జట్లు ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ టోర్నీలో 10 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇరు జట్లు చెరో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక ఓవరాల్‌గా ఇరు జట్లు 95 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇంగ్లండ్ 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 44 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. మరో నాలుగు మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే రద్దు అయ్యాయి.
పిచ్ రిపోర్ట్..
ఇక అహ్మాదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. మిడిల్ ఓవర్లలో కాస్త స్పిన్‌కు అనూకూలించే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, మలన్, రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, సాంట్నర్, ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బౌల్ట్
చదవండి: Babar Azam On Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది బాబర్.. ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment