రెండు గోల్స్ చేసిన సహచరుడు బ్రూనోను అభినందిస్తున్న పోర్చుగల్ కెప్టెన్ రొనాల్డో
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది.
పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు.
పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్‌కర్, గోమెజ్ కొట్టిన షాట్‌లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది.
ప్రపంచకప్‌లో నేడు
డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి
ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి
అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి
మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి
స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment