
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి టెడ్ డెక్స్‌టర్ (86) అనారోగ్యంతో మృతి చెందారు. 1958–1968 మధ్య కాలంలో ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు ఆడిన ఆయన 47.89 సగటుతో 4502 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదే డెక్స్‌టర్‌కు ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది.
రెజ్లింగ్‌కు అండగా యూపీ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రెండు పతకాల (రజతం, కాంస్యం) తో మెరిసిన భారత రెజ్లింగ్‌కు శుభవార్త. వచ్చే ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా దేశంలో రెజ్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు ఉత్తరప్రదేశ్ (యూపీ) ప్రభుత్వం ముందుకు వచ్చింది. హాకీ పునరుత్తేజం కోసం ఒడిశా ప్రభుత్వం అనుసరించిన ప్రణాళికనే రెజ్లింగ్‌లోనూ ప్రవేశపెట్టాలని యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే 11 ఏళ్లలో (2022–32 మధ్య) మూడు దఫాలుగా రెజ్లింగ్ కోసం 170 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్ తెలిపారు. రెజ్లింగ్ అభివృద్ధి కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.