Photo Courtesy: RVCJ media
James Franklin In Big Trouble After Chahals Harassment Allegations: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ బౌలర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఏడాది మెగా వేలం ముగిశాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన ఓ పోడ్‌కాస్ట్ షో సందర్భంగా చహల్ మాట్లాడుతూ.. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ముంబై ఇండియన్స్ ఆటగాడు పీకలదాకా తాగి తనను 15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీసాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతుండగానే చహల్ మరో బాంబు పేల్చాడు.
2011 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు నాటి సహచర ఆటగాళ్లు జేమ్స్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ సైమండ్స్‌లు తనపై భౌతిక దాడికి దిగారని, ఆ ఇద్దరు తన కాళ్లు, చేతలు కట్టివేడేసి, నోటిని ప్లాస్టర్‌తో బిగించి గదిలో పడేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ గెలిచిన ఆనందంలో చిత్తుగా తాగిన ఆ ఇద్దరు తన పట్ల క్రూరంగా ప్రవర్తించారని, మైకంలో తనను కట్టేశారన్న విషయాన్ని సైతం వారు మర్చిపోయారని, దాంతో ఓ రాత్రంతా తాను గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని, మరుసటి రోజు ఉదయం హౌస్ కీపింగ్ బాయ్ నన్ను చూసి కట్లు విప్పాడని తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంత జరిగాక కూడా ఆ ఆటగాళ్లు తనకు క్షమాపణలు చెప్పలేదని చహల్ పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది.
చహల్ ఆరోపణల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ బౌలర్, ప్రస్తుత డర్హమ్ కౌంటీ ప్రధాన కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ చుట్టూ ఉచ్చుబిగుసుకుంటుంది. డర్హమ్ కౌంటీ.. ఫ్రాంక్లిన్‌ను విచారించి చహల్ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేలుస్తామని పేర్కొంది. 2011లో జరిగిన ఘటనకు సంబంధించిన వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయని, మా విచారణలో ఫ్రాంక్లిన్ తప్పు చేసినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలుంటాయని వివరించింది. ఇదిలా ఉంటే, చహల్ తొలుత చేసిన ఆరోపణల (15వ అంతస్థు నుంచి కిందకు వేలాడదీయడం) నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించిన విషయం తెలిసిందే.
చదవండి: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి'
Comments
Please login to add a commentAdd a comment